telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు రీఓపెన్‌..

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మూసి వేసిన అన్ని విద్యాసంస్థ‌లు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు.. కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.

పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందన్న వైద్యఆరోగ్య శాఖ.. స్కూల్స్, కాలేజ్‌లు తెరవడానికి ముందు పూర్తిగా శానిటైజేషన్ నిర్వహించాలని నిర్ణయించారు.  విద్యాసంస్థల్లో అర్హులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. 

మ‌రోవైపు విద్యా వైద్య ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించి పాఠశాలల పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నందుకు  కేసీఆర్‌ గారికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారికి మరియు వైద్యశాఖా మంత్రి హరీష్ రావు గారికి, ఇతర ఉన్నతాధికారులకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తల్లిదండ్రులు ,ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు సమయాన్ని పొడిగించినందుకు కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదే సమయంలో పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు బాధ్యతతో మెలగాలని , కరోనా రక్షణ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విద్యాబోధన చేపట్టాలని, తల్లిదండ్రులకు విద్యార్థులకు కరోనా నుండి స్వీయ రక్షణ చర్యల గురించి అవగాహన కల్పించాలని యాదగిరి శేఖర్ రావు కోరారు.

ఈ విద్యాసంవత్సరంలో కొన్ని నెలల పాటు పాఠశాల మూసి ఉంచిన కారణంగా ఈ విద్యా సంవత్సరాన్ని మే నెలాఖరు వరకు పొడిగించాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ కు విజ్ఞప్తి చేశారు.

అలాగే..పాఠశాలలో మూసి ఉంచడం వలన విద్యార్థులకు జరిగే విద్యా నష్టాన్ని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనను, రాబోయే తరాల పై పడే చెడు ప్రభావాన్ని సకాలంలో గుర్తించి పాఠశాలను తెరవాలని, లేనిపక్షంలో జరిగే తీవ్ర నష్టాన్ని తమ పత్రిక మరియు ఛానల్ ల ద్వారా అందరికీ తెలియపరుస్తూ, క్షేత్ర స్థాయి నుండి ముఖ్యమంత్రి గారి వరకు ఈ సమస్యపై స్పష్టమైన అవగాహన కల్పించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరుపేరునా ఈ సందర్భంగా ట్రస్మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Related posts