ఇటీవలనే ”తనాజీ: ది అన్సంగ్ వారియర్” చిత్రంతో ప్రాచీన భారత యోధుల శౌర్యాన్ని చూపించిన అజయ్ దేవ్‌గన్.. ఇప్పుడు భారత సైన్యంలోని వీరుల కథను వెండితెరపైకి తెచ్చేందుకు సన్నాహాల్లో ఉన్నారు. జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో చైనా దురాఘతానికి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అమరులైన వారిలో సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో ఇండో-చైనా మధ్య జరిగిన ఉద్రిక్తతలపై అజయ్ దేవ్‌గన్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ తన ట్విట్టర్ వేదిక ద్వారా ఈ సమాచారమిచ్చారు. గాల్వన్ లోయలో జరిగిన ఘటనపై అజయ్ దేవ్‌గన్ సినిమా చేయబోతున్నట్లు తరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ను ప్రకటించలేదు. ఈ చిత్రంలో చైనా సైన్యంతో పోరాడి అమరులైన 20 మంది భారత ఆర్మీ సైనికుల కథను చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గన్ ఎఫ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ సంయూక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్ర తారాగణాన్ని ఇంకా ఖరారు చేయాల్సిఉంది. అయితే.. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ నటిస్తారా లేదా అనేది స్పష్టత రాలేదు. ఈ వార్త వెలువడినప్పటి నుంచి అజయ్ దేవగన్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మరోవైపు ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు మేజర్ రవి భారత-చైనా సరిహద్దు వివాదంపై `బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్` పేరుతో ఒక చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది. మేజర్ రవి దేశభక్తి సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట. ఇటీవల `1971: బియాండ్ బోర్డర్స్` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించిన వార్ డ్రామా ఇది.
previous post