telugu navyamedia
క్రీడలు

ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో రానో: వినేశ్‌ ఫొగాట్‌

భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌ నుంచి తిరిగి వచ్చిన ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్య్లూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన వినేశ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో.. ‘ఇక రెజ్లింగ్‌కు తిరిగొస్తానో రానో’ అంటూ కామెంట్‌ చేయడం ఆసక్తి కలిగించింది.

వినేశ్‌ ఓ జాతీయ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఎంత త్వరగా పైకి లేస్తామో.. అంతే త్వరగా కిందపడిపోతాం. ఒక్క పతకం సాధించలేకపోయా. ఇప్పుడు అంతా అయిపోయింది. మళ్లీ మ్యాట్‌పైకి ఎప్పుడు వెళతానో తెలియదు. విరిగిన కాలు బాగుందనే అనుకుంటున్నా. ఇప్పుడు నా శరీర భాగం విరగలేదు.. కానీ నా మనసు ముక్కలైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. 2017 కంకషన్‌కు గురికావడం, అనంతరం రెండు సార్లు కరోనా సోకడం టోక్యోలో తన ప్రదర్శనను ప్రభావితం చేశాయని వాపోయింది. మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందిపడినట్లు పేర్కొంది.

రియో ఒలింపిక్స్‌(2016)లో ప్రత్యర్థితో పోటీ పడుతుండగా వినేశ్‌ మోకాలికి గాయమైంది. దీంతో ఆమె ఆ పోటీల నుంచి నిష్క్రమించింది. అయితే ఆ గాయం నుంచి కోలుకున్న వినేశ్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో (53 కేజీల విభాగంలో) ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ క్వార్టర్‌ ఫైనల్లో ఆమెకు ఊహించని షాక్‌ తగింది. బెలారస్‌కు చెందిన వెనెసా చేతిలో ఓటమిపాలైంది. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా తాత్కాలిక నిషేధానికి గురైంది.

అనుచిత ప్రవర్తన కారణంగా వినేశ్‌ ఫొగాట్‌పై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ఒలింపిక్స్‌ జరిగేటప్పుడు క్రీడా గ్రామంలో అథ్లెట్లకు కేటాయించిన గదుల వద్ద తోటి రెజ్లర్లతో కలిసి ఆమె ఉండటానికి నిరాకరించిందని, అలాగే వారితో ప్రాక్టీస్‌ చేయలేదని, మరోవైపు ఒలింపిక్స్‌లోనూ భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్‌ కిట్‌ను ధరించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చేరిన వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యాలన్నీ రెజ్లర్‌ మానసికంగా కుంగిపోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

Related posts