పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ అధికారులు మధ్యాహ్నం రెండు గంటల తరువాత అభినందన్‌ను వాఘా సరిహద్దు వద్దకు తీసుకురానున్నట్టు సమాచారం. దీంతో వాఘా సరిహద్దు వద్ద టెన్షన్ నెలకొంది. జెనీవా ఒప్పందాన్ని అనుసరించి పాక్ అధికారులు తొలుత అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక కోసం దేశ ప్రజలందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరోవైపు స్వదేశంలోకి అడుగుపెట్టనున్న అభినందన్‌కు ఐఏఎఫ్ అధికారులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అభినందన్‌కు స్వాగతం పలికే అవకాశం ఇవ్వాల్సిందిగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అభినందన్‌కు స్వాగతం పలకడం కోసం ఆయన తల్లిదండ్రులు గురువారం అర్ధరాత్రి చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం వారు అమృతసర్‌కు ఫ్లైట్‌లో బయలుదేరారు.