telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

భగీరధకు.. చెదలు.. దళారుల దారుణాలు..

mediators abolishing bhagiradha scheme

ప్రభుత్వ పధకాలు అంటేనే దళారుల మయం. వారిని దాటుకొని పథకాలు ప్రజల వరకు చేరుకోవడం నాడు నెహ్రు కాలంలోనే పైనుండి రూపాయి పంపితే ఐదు పైసలు ప్రజలకు చేరేది అని విన్నాం, నేడు అదే చూడాల్సి వస్తుంది కూడా. మరి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పథకాల వరకూ దళారులు ప్రతీచోటా కనిపిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకానికి సైతం దళారుల సెగ తగిలింది. ఈ పథకం కింద త్వరగా మంచినీటి కనెక్షన్ మంజూరు అయ్యేలా చేస్తామని ఓ వ్యక్తి నమ్మబలికాడు. ఇందుకు భారీగా డబ్బును డిమాండ్ చేశాడు. చివరికి ఈ విషయం అధికారులకు చేరడంతో ఈ తతంగాన్ని వారు అడ్డుకున్నారు.

రంగారెడ్డి జిల్లా దుండిగల్ మండలం దూలపల్లి గ్రామానికి వచ్చిన సతీశ్ అనే వ్యక్తి తాను మిషన్ భగీరథ ప్రాజెక్టులో అధికారిగా పనిచేస్తున్నానని తెలిపాడు. ఈ పథకం కింద మంచి నీటి కనెక్షన్లు కావాలంటే రేకుల ఇంటికి రూ.500, ఒక అంతస్తుకు రూ.2,200, రెండు అంతకంటే ఎక్కువ అంతస్తులున్న ఇంటికి రూ.4,000 చెల్లించాలని కోరాడు. అయితే అతనిపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి మీడియాకు ఫోన్ చేయడంతో విషయం అధికారుల వరకూ వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సతీశ్ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని స్పష్టం చేశారు. అతను ఓ దళారి అని వ్యాఖ్యానించారు. దరఖాస్తు చేసుకుంటే మిషన్ భగీరథ కింద రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. దళారులు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసులకు అప్పగించాలని సూచించారు.

Related posts