telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్స్ కు గ్రీన్ సిగ్నల్…!

Tollywood

లాక్‌డౌన్ వ‌ల‌న గ‌త రెండు నెల‌లుగా సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇస్తున్న నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మకి సంబంధించిన భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక గురించి చ‌ర్చించేందుకు జూబ్లిహిల్స్ లోని ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల తో సమావేశమ‌య్యారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వ్.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, N. శంకర్, కొరటాల శివ తదితరులు ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు. దాదాపు 35 మంది స‌భ్యుల‌తో కూడిన ఈ స‌మావేశంలో ముఖ్యంగా థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు, సినిమా షూటింగ్స్ వంటి విష‌యాల‌పై చ‌ర్చించారు. త‌ల‌సాని మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కి ఎలాంటి అడ్డంకులు ఉండ‌వ‌ని అన్నారు. సినిమా షూటింగ్స్ విష‌యాన్ని సీఎంతో చ‌ర్చించి త్వ‌ర‌లోనే దానిపై ఓ నిర్ణ‌యాన్ని తెలియ‌జేస్తాం. ఇప్ప‌టి వ‌ర‌కు సినీ ప‌రిశ్ర‌మ ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తుంది. ఈ మీటింగ్‌లో షూటింగ్‌లో తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లపై కూడా చ‌ర్చించాం అని త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు. మంత్రి త‌ల‌సానితో జ‌రిగిన స‌మీక్ష‌లో రానున్న రోజుల‌లో షూటింగ్ ఎలా నిర్వ‌హించాలి., ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల‌సిన సినిమాలు ఎప్పుడు విడుద‌ల చేయాలి, ఫారెన్‌లో షూటింగ్‌లు నిర్వ‌హించాల‌ని ముందుగానే అనుకున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎలాంటి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాలి అనే దానిపై చిరు మాట్లాడారు. నాగార్జున‌, రాజ‌మౌళి వంటి ప్ర‌ముఖులు కూడా తమ అభిప్రాయాల‌ని వ్య‌క్తం చేయ‌గా, ఈ విష‌యాల‌పై సీఎంగారితో చ‌ర్చించి త్వ‌ర‌లో పూర్తి విష‌యాల‌ని వెల్ల‌డిస్తాం అని త‌ల‌సాని పేర్కొన్నారు.

Related posts