అమెరికాలోని కొలరాడోలో వృద్ధ దంపతులకు భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఓ ఎలుగుబంటి తన ఇద్దరు పిల్లలతో కలిసి జార్జ్ ఫీల్డ్, జాన్ జాన్సన్ అనే దంపతుల ఇంట్లోకి చొరబడింది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ భయానక సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో టీవీ చూస్తున్న దంపతులకు ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. దాంతో వెళ్లిన చూసిన జార్జ్ ఫీల్డ్ దంపతులకు ఎదురుగా ఎలుగుబంటి దాని ఇద్దరు పిల్లలు కనిపించాయి. వెంటనే వారు మెట్లపైకి ఎక్కి ఎలుగుబంటిని బయటకు తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎలుగుబంటి బయటకు వెళ్లకపోగా జార్జ్ ఫీల్డ్‌పై దాడికి పాల్పడింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. అతడి ముఖం, పొట్టపై ఎలుగుబంటి రక్కేసింది. భర్త జార్జ్‌ను కిందపడేసి ఎలుగుబంటి దాడి చేస్తున్న దృశ్యం చూసి భయంతో భార్య జాన్ జాన్సన్ అలాగే బిగిసుకుపోయింది. కొద్దిసేపటి తరువాత తేరుకున్న ఆమె బేస్‌బాల్ బ్యాట్ తీసుకొచ్చి ఎలుగుబంటిపై విరుచుకుపడింది. దాంతో భయపడిపోయిన ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
previous post
కేసీఆర్ ఇలాకలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ: కేటీఆర్