telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె విరమణ

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రతిపాదనను చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు.

విద్యుత్ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకు సాగిన చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.

గత మంగళవారం ప్రారంభమైన చర్చలు అసంపూర్తిగా నిలిచినా, శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమక్షంలో మళ్లీ ప్రారంభమయ్యాయి.

పలు దఫాలుగా సాగిన చర్చల అనంతరం, సీఎం పిలుపు రావడంతో విజయానంద్ వెళ్ళి యాజమాన్యం తరఫున అంగీకరించగల డిమాండ్లపై స్పష్టత నిచ్చారు.

ఆ తర్వాత జెన్‌కో ఎండీ నాగలక్ష్మి, జేఎండీ ప్రవీణ్‌చంద్ నేతృత్వంలో చర్చలు కొనసాగాయి.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంపై యాజమాన్యం అంగీకరించకపోయినా ఇతర పలు డిమాండ్లపై అంగీకారం రావడంతో సమ్మె విరమణకు ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చాయి.

చర్చలు అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగాయి.

ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్న 29 డిమాండ్లలో మెజారిటీ అంశాలకు యాజమాన్యం అంగీకారం తెలిపింది.

Related posts