ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకను ప్రకటించారు.
శ్రావణమాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని, 10 వేల మంది మహిళలకు చీరలతో పాటు పసుపు, కుంకుమలను అందించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 22వ తేదీన పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ పాదగయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అక్కడి ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరపనున్నారు.
ఈ వ్రతాల్లో పాల్గొనే మహిళలకు ఈ కానుకలను అందజేయనున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు, రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తారు.
ప్రతి విడతకూ అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని అమ్మవార్ల పేర్లతో నామకరణం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళల కోసం గురువారం నుంచే కూపన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
ప్రతి కూపన్‌పై నిర్దిష్ట సమయాన్ని ముద్రిస్తారు. మహిళలు తమకు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చే మహిళలకు కూడా కానుకలు అందజేస్తామని స్పష్టం చేశారు.
ఈ బృహత్కార్యక్రమాన్ని దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు సమన్వయంతో పర్యవేక్షించనున్నారు.

