నిర్ణీత గడువులోగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఫతేనగర్, ఖాజాకుంట, మియాపూర్ – పటేల్ చెరువు ఎస్టీపీలను సోమవారం సందర్శించి పనులు పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులకు అనుగుణంగా కార్మికులు, బృందాల సంఖ్య పెంచాలని సూచించారు. ఇన్ లెట్, అవుట్ లెట్, యంత్రాల బిగింపు, ఎలక్ట్రికల్ తదితర అన్ని పనులు సమాంతరంగా జరపాలన్నారు. తద్వారా పనులు త్వరగా పూర్తి చేయవచ్చని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఉండేట్లు చూడాలన్నారు. పనులు జరిగే ప్రదేశంలో కార్మికుల రక్షణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రివేళల్లో పనులు చేయడానికి వీలుగా లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు, దీనికోసం విదేశీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా. ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రాంతంలో రోజూ 1650 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఇక మిగిలిన 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 31 నూతన మురుగు నీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ)ల నిర్మాణాలు చేపట్టింది. వీటిని నిర్మించే బాధ్యతను జలమండలిపై పెట్టింది. రూ.3,866.41 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు.
• ప్యాకేజీల పరంగా..
1) ప్యాకేజీ-I లో అల్వాల్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
2) ప్యాకేజీ-II లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.
3) ప్యాకేజీ-III లో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.
ఈ 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే.. నగరంలో మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వీటి ద్వారా రోజూ 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది.
తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు