ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్న ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకూ ఈ విషయంలో చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి కూల్చి వేల్చతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను కూడా థిక్కరిస్తే ఎలా అని ప్రశ్నించింది.
అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. తమ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిలిపివేయాలంటూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేష్ ఆదివారం హైకోర్టులో హౌస్ మోహసన్ పిటిషన్ దాఖలు చేశారు. జనవనరుల శాఖ గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు. తహసీల్దార్, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని.. రాజకీయ కక్షతో, నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారన్నారు.
దీంతో వాదనలు విన్న అనంతరం హైకోర్టు అయ్యన్న ఇంటి దగ్గర కూల్చివేతపై స్టే విధించింది. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక అధికారులకు తెలియజేయాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇంటి జోలికి వెళ్లవద్దని ఆదేశాలు జారీచేస్తూ..విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు..
కాగా..అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యన్న పాత్రుడు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూమి, కాల్వకు సంబంధించిన రెండు సెంట్లను ఆక్రమించి భవనాన్ని నిర్మించినట్టు ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు తెల్లవారుజామున జేసీబీతో వచ్చి అయ్యన్న ఇంటి గోడను పగులకొట్టారు.
ఈ విషయం తెలుసుకున్నఅయ్యన్న అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అయ్యన్న ఇంటిని చేరుకోవడానికి ప్రయత్నించగా వారిని అధికారులతో పాటు వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు.

