telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఉగ్రవాదుల కుట్రను భ‌గ్నం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు..

దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో .. ఉగ్రవాదుల కుట్రను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ ఉగ్రవాదిని మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి ఏకే-47 సహా గ్రేనెడ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రవాది మహ్మద్ అష్రఫ్ అలియాస్ అలీ దేశ రాజధానితో సహా కశ్మీర్ లోయలో అనేక తీవ్రవాద దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ద‌స‌రా పండగల వేళ దేశ రాజధానిలో ఉగ్రముఠాలు దాడులు నిర్వహించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో.. నకిలీ గుర్తింపుకార్డుతో గత కొన్నాళ్లుగా దిల్లీలోనే ఉంటున్న మహ్మద్‌ అష్రఫ్​ అనే వ్యక్తి ని అరెస్ట్ చేశారు. అష్రఫ్​ను పాకిస్థాన్​ ఐఎస్​ఐ ఏజెంట్​గా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాలు..
“మహ్మద్ అష్రఫ్ అలియాస్ అలీ పాకిస్థాన్​లోని పంజాబ్ నివాసి. అతను ఒక భారతీయ అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను తన భార్య నుండి విడిపోయి విడిగా నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి దిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశాం. అలీ అహ్మద్ నూరి పేరిట నకిలీ గుర్తింపుతో భారత్​లో ఉంటున్నాడు. ఏకే-47, 60 బుల్లెట్లు, ఓ గ్రెనేడ్, రెండు పిస్టల్‌లతో పాటు ఫేక్ ఐడీ, ఓ బ్యాగ్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామ‌ని” పోలీసులు తెలిపారు

ఉగ్రవాది ఆయుధాలను కలింది కుంజ్ సమీపంలో యమునా ఒడ్డున ఇసుక కింద పాతిపెట్టాడు. ఇతడితో సంబంధం ఉన్న మరికొంతమందిని త్వరలో అరెస్టు చేయవచ్చని ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం తెలిపింది. మహ్మద్ అష్రఫ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు.

Related posts