బ్రెజిల్‌లోని రియో డీ జనీరో జైలు నుంచి తప్పించుకోడానికి ఓ ఖైదీ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఓ కేసులో క్లావినో డా సిల్వా అనే వ్యక్తి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అతనిని కలవడానికి తన 19 ఏళ్ల కూతురు జైలుకు వచ్చింది. తిరిగి జైలు నుంచి బయటకు వెళ్లే సమయంలో అధికారులు ఆమెను ఆపారు. ఆమె సిగ్గు చూసి అనుమానించిన అధికారులు వెంటనే అది క్లావినో అని కనిపెట్టేశారు. తన కూతురిని తన స్థానంలో పెట్టి.. అచ్చం కూతురిలా మేకప్, ఫేస్‌మాస్క్ వేసుకుని క్లావినో జైలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. దాదాపు గేటు వరకు వెళ్లిపోయిన క్లావినో చివరగా… అమ్మాయిలా సిగ్గు పడాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. క్లావినో ఏ విధంగా రెడీ అయ్యాడో అందరికీ తెలిసేలా జైలు అధికారులు అతడి వేషాన్ని విప్పే సన్నివేశాన్ని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అచ్చం అమ్మాయిలానే ఉన్నాడని, చిన్న తప్పు చేసి భలే దొరికిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే క్లావినోకు ఆ దుస్తులు, వేషం ఎక్కడి నుంచి వచ్చాయా అని అధికారులు సందేహించగా, మరో యువతి గర్భిణీ వేషంలో వచ్చి ఇవన్నీ అందించిందని అధికారులు తెలుసుకున్నారు. ఇప్పటికే క్లావినో అనేక సార్లు పారిపోవడానికి ప్రయత్నించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం క్లావినోను జైలులో హై సెక్యూరిటీ ఉండే ప్రదేశానికి మార్చారు.
previous post