telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో కొత్త జట్లు… బీసీసీఐ సమావేశం

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ.. అందునా విదేశంలో నిర్వహించిన ఐపీఎల్‌ 2020 సీజన్ సూపర్‌ సక్సెస్‌ కావడంతో బీసీసీఐ ఫుల్‌ జోష్‌లో ఉంది. 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్న బోర్డు.. రెండు కొత్త జట్లకు లీగ్‌లో స్థానం కల్పించాలని భావిస్తోంది. 13వ సీజన్‌కు ఫ్యాన్స్‌ నుంచి మునుపెన్నడూలేని రీతిలో భారీ స్పందన లభించడంతో టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఆ క్రమంలోనే అహ్మదాబాద్ సిటీ వేదికగా ఒక జట్టుతో పాటు మరో టీమ్‌నే చేర్చాలనే ప్రతిపాదనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 24న వార్షిక సర్వసభ్య సమావేశంకు పిలుపునిచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా అనుబంధ విభాగాలకు పంపించారని కూడా ప్రచారం జరుగుతోంది. సమాచారం మేరకు ఈ వార్షిక సమావేశంలో బీసీసీఐ మొత్తం 23 అంశాలపై చర్చించనుంది. బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికపై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 2019లో మహిమ్ వర్మ బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ అతను ఈ ఏడాది ఆరంభంలో తన పదవికి రాజీనామా చేశాడు.

ఇక ఈ సమావేశంలో ప్రధానంగా ఐపీఎల్ 14వ ఎడిషన్ నిర్వహణ గురించే చర్చించనున్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు ఇంకా నాలుగు నెలల సమయమే ఉండటంతో కార్యచరణను వేగవంతం చేయాల్సి ఉంది. కొత్తగా రెండు జట్లను చేరిస్తే మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే మినీ వేలాన్నైనా నిర్వహించాలి. దీనిపై కూడా ఓ నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంపై ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు స్పష్టత కోరగా.. డిసెంబర్ వరకు వేచిచూడమన్న బోర్డు ఇంతవరకు అధికారికంగా ఏలాంటి ప్రకటన చేయలేదు. ఇక కొత్త జట్ల రాకను ఫ్రాంచైజీలను వ్యతిరేకిస్తున్నాయి. చాలా తక్కువ సమయం ఉన్నందున మెగా వేలానికి సిద్దం కాలేమని పేర్కొన్నాయి. ఈ అంశంపై కూడా బీసీసీఐ చర్చించాల్సి ఉంది. అలాగే భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికపై కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. అలాగే కొత్త జట్లతో చేరికతో కొన్ని రూల్స్‌ కూడా మారవచ్చని తెలిపాడు.

Related posts