telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

74 సంవత్సరాల “సంసారం”.

నందమూరి తారకరామారావు గారు నటించిన ఐదవ సినిమా సాధనా పిక్చర్స్ “సంసారం” 29-12-1950 విడుదలయ్యింది. నిర్మాతలు కె.వి.కృష్ణ, సివి.రంగనాథదాస్ లు సాధనా పిక్చర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు ఎల్.వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, పాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, ఫోటోగ్రఫీ: ఎం.ఏ.రెహమాన్, కళ: టి.వి.ఎస్.శర్మ, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి అందించారు. ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, లక్ష్మీరాజ్యం, అక్కినేని నాగేశ్వరరావు, పుష్ఫలత, సూర్యకాంతం, రేలంగి వెంకట్రామయ్య, సురభి బాలసరస్వతి, సావిత్రి తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారు అందించింన స్వరాలు.
“సంసారం సంసారం సంసారం ప్రేమ సుధా పూరం నవ జీవనసారం”
“కల నిజ మాయేగా,కోరిక తీరెగా,సాటిలేని రీతిగా”
“టకు టకు టకు టకు టముకుల బండీ,లంఖనాల బండీ,ఎద్దుల బండీ”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ద్వారా నటిశిరోమణి సావిత్రి గారు ఒక చిన్న పాత్రలో తొలిసారిగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఎన్.టి.రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన రెండవ చిత్రం “సంసారం”. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా “పల్లెటూరి పిల్ల” 1950లో విడుదల అయింది.

ఈ చిత్రం ఘన విజయం సాధించి మొదటి రన్ లో 11 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. మొత్తం 6 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి శత దినోత్సవం జరుపుకున్నది. (మొదటి రిలీజ్ లో విజయవాడ, రాజమండ్రి, ఏలూరు లలో, లేట్ రిలీజ్ లో గుంటూరు, మద్రాసు, సికింద్రాబాద్ లలో 100 రోజులు ఆడింది) ఒక కేంద్రం మద్రాసు లో 224 రోజులు ప్రదర్శింపబడింది.

100 రోజులు ఆడిన కేంద్రాలు:-
విజయవాడ — జైహింద్ టాకీస్ (156 రోజులు )
గుంటూరు — శ్రీరాధాకృష్ణ (లేట్ రిలీజ్ ) – 100 రోజులు
రాజమండ్రీ — శ్రీరామా ( నాగదేవి) – 100 రోజులు
ఏలూరు — శ్రీ గోపాలకృష్ణ, (100 రోజులు)
సికింద్రాబాద్ – పారామౌంట్ (లేట్ రిలీజ్),-108 రోజులు,
మద్రాసు(పల్లవరం) – జనతా టాకీస్(లేట్ రిలీజ్) – 224 రోజులు.
ఈ చిత్రాన్ని తమిళంలో సంసారం (1951) పేరుతో
హిందీలో సంసార్(1951) పేరుతో మలయాళంలో అయోధ్య(1975)పేరుతో రీమేక్ చేయడం జరిగింది…

Related posts