telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశ భూభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే..

హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోహ్‌ ఘనంగా ప్రారంభమైంది. శిక్షణ పూర్తిచేసుకున్న 73వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ ఐపీఎస్‌ల నుంచి దోవల్‌ గౌరవ వందనం స్వీకరించారు.

శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు 32 లక్షల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పరిరక్షించే బాధ్యత ట్రైనీ ఐపీఎస్​లపై ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతోందని.. మరో 2 దశాబ్దాల్లో మన దేశం ప్రపంచంలోనే కీలకపాత్ర పోషించనుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ తెలిపారు. చట్టాలు చేయటం మాత్రమే గొప్ప విషయం కాదని…. వాటిని పరిరక్షించి, అమల్లోకి తీసుకువచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు

ప్రజాస్వామ్యం పరిరక్షణ మీ సామర్థ్యం, అంకితభావం, నడవడిక, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. 130కోట్ల మంది ప్రజలకు సంబంధించిన చట్టాలను పరిరక్షించే బాధ్యతను యువ ఐపీఎస్‌లు తీసుకోబోతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ మాత్రమే కాదు… దేశ భూభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుందని తెలిపారు.

73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. కాగా, పరేడ్‌కు వరుసగా మూడోసారి మహిళా అధికారి కమాండర్‌గా అవకాశం మహిళా అధికారికే దక్కింది. ట్రైనింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దర్పణ్‌ అహ్లువాలియా పాసింగ్‌ అవుట్‌ కమాండర్‌గా వ్యహరించారు.

ఈ బ్యాచ్​లో తెలంగాణ రాష్ట్రానికి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించగా.. ఏపీకి ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయించారు.శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పంజాబ్ క్యాడర్​కు చెందిన దర్పణ్ అహ్లువాలియాకు డోభాల్.. కె.ఎస్.వ్యాస్ ట్రోఫీ అందించారు. అనంతరం.. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.

Related posts