telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

67 సంవత్సరాల కళాత్మక చిత్రం “మాయాబజార్”

నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా పూర్తి స్థాయిలో శ్రీ కృష్ణుడుగా నటించిన పౌరాణిక చిత్రం విజయా వారి “మాయాబజార్” సినిమా 27మార్చి 1957 న విడుదలయ్యింది .
నిర్మాతలు నాగిరెడ్డి,చక్రపాణిలు విజయా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన మహత్తర పౌరాణిక చిత్ర రాజం “మాయా బజార్”.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: కె.వి.రెడ్డి, రచన, మాటలు,

పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: మార్కస్ బార్ట్లేకళ: గోఖలే, కళాధర్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, కూర్పు: జంబులింగం, అందించారు.
ఈచిత్రం లో ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్.వి. రంగారావు, సావిత్రి, గుమ్మడి, ఋష్యేంద్రమణి, సి.యస్.ఆర్, ముక్కామల, రేలంగి,రమణా రెడ్డి, సంధ్య, సూర్యకాంతం, మిక్కిలి నేని, ఆర్.నాగేశ్వరరావు, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య, వంగర, నాగభూషణం, మాధవపెద్ది తదితరులు నటించారు.

మధుర గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో కూర్చిన బాణీలు ఆణి ముత్యాలలా నేటికి ప్రేక్షకులకు వీనుల విందులు చేస్తున్నాయి.

“నీవేనా ననుతలచినది”
“చూపులు కలసిన శుభవేళ”
“లాహిరి లాహిరి లాహిరిలో”
“నీకోసమే నే జీవించునది”
“అహనా పెళ్ళి యంట ఓహోనా పెళ్ళి యంట”
“వివాహ భోజనంబు వింతైన వంటకంబు”
“సుందరి నీవంటి దివ్యస్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా”
వంటి సూపర్ హిట్ పాటలు నాటికి నేటికీ శ్రోతలను అలరిస్తున్నాయి.

ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు గారి గురుతుల్యులైన కె.వి.రెడ్డి గారు తొలిసారిగా ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడు గా పూర్తి స్థాయిలో చూపించి పండిత పామరులను సైతం ఆశ్చర్య చకితులను చేశారు.
మొదటిసారి పూర్తి స్థాయి శ్రీ కృష్ణుని పాత్రలో సాక్షాత్కరించి తెలుగు సినీ ప్రపంచంలో పెను సంచలనాలు సృష్టించారు ఎన్ టి ఆర్. ఈ చిత్రంలో శ్రీ కృష్ణ పాత్ర పోషణ సకల జనమనోరంజకమై అలరారింది. వారి హృదయాలలో గాఢమైన ముద్రవేసి వారి ఇంట పూజా మందిరాలలో ఆయన చిత్రపటాలు కొలువుతీరాయంటే జనాన్ని ఎంతగా ఎన్.టి.ఆర్ ప్రభావితం చేసారో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమంలో శ్రీ కృష్ణ పాత్రకు మరింత మెరుగులు దిద్ది “నభూతో నభవిష్యత్తుగా” తెలుగు వారి గుండెలలో చిరస్థాయిగా శ్రీకృష్ణుడు గా నిచిపోయారు

ఎన్.టి.ఆర్. గారు.
ఈ చిత్రం ప్రదర్శన సమయంలో ఎన్.టి. రామారావు గారు శ్రీ కృష్ణుడు గెటప్ తో రూపొందించిన క్యాలెండర్లు ఆ రోజుల్లోనే 5,00,000 విజయా సంస్థ ప్రెస్ నుండి అధికారికం గా అమ్ముడైనట్లు నిర్మాత నాగిరెడ్డి గారు పలు సందర్భాలలో పేర్కొనడం జరిగింది. ఇక డూప్లికేట్లు ఎన్ని అమ్ముడయ్యాయో ఊహకందని విషయం.
ఆనాటి నుండి మొత్తం 18 సినిమాలలో పూర్తి స్థాయి శ్రీకృష్ణుని పాత్రను పోషించారు ఎన్టీఆర్. అంతేగాక 33 పర్యాయాలు సినిమాపాటలలోను, నాటకాలలోను, అంతర్నాటకాలలోను శ్రీకృషుడుగా నటించారు ఎన్టీఆర్ గారు.
ఈ విధంగా ఒకే పాత్రను ఇన్ని సార్లు పోషించి మెప్పించిన నటులు భారత దేశంలోనే కాదు, ప్రపంచంలోకూడా ఎవ్వరు లేరు. ఆ ఘనత, ఆ కీర్తి ఒక్క ఎన్టీఆర్ గారికే దక్కింది.

విజయా వారి చిత్రాలలో ఆణిముత్యo గా నిలిచిన చిత్రం “మాయాబజార్”.
ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు,
మొత్తం 23 కేంద్రాలలో 100 రోజులు (తొలివిడత 15 కేంద్రాలలోను, ఆపిదప 8 కేంద్రాలలోను)
ప్రదర్శింపబడింది. అంతేకాకుండా శతదినోత్సవం తో పాటు రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) కూడా జరుపుకున్నది.
ఫస్ట్ రిలీజ్ 15 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.

100 రోజులు ఆడిన కేంద్రాలు:–
1. విజయవాడ – దుర్గా కళామందిరం,
2. నెల్లూరు – శేష మహల్,
3. గుంటూరు – న్యూ సిటీ టాకీస్(లిబర్టీ),
4. తెనాలి – రత్నా టాకీస్,
5. ఏలూరు – శ్రీ పాండురంగ,
6. కాకినాడ – క్రౌన్,
7. రాజమండ్రి – అశోక్ మహల్,
8. విశాఖపట్నం – శ్రీలక్ష్మి,
9. విజయనగరం– శ్రీకృష్ణ,
10. మచిలీపట్నం – బృందావన్,
11. భీమవరం – మారుతి,
12. శ్రీకాకుళం – శ్రీ ఆంజనేయ,
13. ఒంగోలు – జయలక్ష్మి,
14. కర్నూల్ – చాంద్,
15. మదనపల్లి – జ్యోతి

విజయవాడ – దుర్గాకళామందిర్ లో 175 రోజులు
ప్రదర్శింపబడి సిల్వర్ జూబ్లీ జరుపుకున్నది.
“మాయాబజార్ ” తెలుగు చిత్రం విడుదలైన
రెండు వారాల తర్వాత తమిళ సినిమా 1957 లో విడుదలైనది.

తమిళ చిత్రం లో అభిమన్యుడు పాత్రను జెమిని గణేషన్ పోషించారు. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్.వి.రంగారావు తమిళంలో కూడా నటించారు. కాగా ఈ చిత్రాన్ని కన్నడం (1965) లో, హిందీలో (1971) లో డబ్బింగ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా విజయం సాధించింది.
“మాయాబజార్” సినిమా తెలుగు, తమిళం లలో ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళ,కర్ణాటక,బొంబాయి లలో మొత్తం

90 కేంద్రాలలో విడుదల చేశారు.
2010 లో “మాయా బజార్” బ్లాక్ వైట్ తెలుగు
చిత్రాన్ని రంగుల (కలర్) లోకి మార్చి విడుదల చేయగా కొన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి సంచలనం సృష్టించింది.. ఈ విధంగా డిజిటల్లీ రిమాస్టర్డ్‌ చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
30-01-2010 లో కలర్ లో విడుదల అయిన “మాయాబజార్” చిత్రం 100 రోజులు ఆడింది. ఈ
సందర్భంగా హైదరాబాద్ లో 100 రోజుల వేడుక కూడా నిర్వహించారు.

1957 లో ఉత్తమ తెలుగు చిత్రం గా ఫిలిం ఫేర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనలో ఎంపిక అయినది.
అంతేకాకుండా 2013 లో సి.యన్.యన్.& ఐ.బి.ఎన్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో అత్యుత్తమ చిత్రంగా “మాయా బజార్” చిత్రం ఎంపికై భారత దేశం లోనే చూడదగ్గ అత్యద్భుత చలన చిత్రాల జాబితాలో ప్రథమం గా నిలిచింది. నాటికీ నేటికీ ఏనాటికీ తీసిపోని వెండితెర ఇతిహాసంగా “మాయా బజార్” చిత్రం చరిత్రలో అత్యద్భుతమైన దృశ్యకావంగా నిలిచి పోయింది….

Related posts