telugu navyamedia
సినిమా వార్తలు

ఈనాటి ఈ బంధమేనాటిదో.. పాట ఎక్కడ తీశారో తెలుసా ?

మనసుకు మనసుకు మధ్యన ఉండే సున్నితమైన అనుబంధాన్ని అక్షరాల్లో చెప్పడం కష్టం. స్ఫూర్తినిచ్చే ఆ అనుభూతిని వర్ణించడం కూడా సాధ్యం కాదేమో ! మనసులు కలసిన తరువాత మధురమైన ప్రేమ అంకురిస్తుంది. అయితే ఆ ప్రేమ పెళ్ళికి దారితీస్తే ఆ జంట జీవితం ఆనందనందనమే . ఒకవేళ వారిద్దరి మధ్య కులాలు, మతాలు, అంతస్తులు అడ్డుగోడలుగా నిలిస్తే .. ఆ ప్రేమ సాఫల్యం కాదు. ఆ ప్రేమ కాలంతో మాసిపోతుంది.

ఇద్దరు యువతీ యువకుల మధ్య ప్రేమ అంతర్లీనంగా వున్నా, వారు వ్యక్తపరుచుకోలేక పోవచ్చు. కారణం వారి ఆర్ధిక స్థితి గతులు కావచ్చు సమాజం ఏర్పచిన కట్టుబాట్లు దాటే ధైర్యం లేకపోవచ్చు. అయితే వారిద్దరి మనస్సులో వున్నది నిస్వార్థమైన ప్రేమే అయితే .. .. మరు జన్మలో కూడా తప్పకుండా ఆ ప్రేమ సాఫల్యం అవుతుందనే నమ్మకంపై రూపొందించిన సినిమా బాబూ మూవీస్ వారి “మూగమనసులు .

TeluguCinemaHistory on Twitter: "#ANR I #Savitri in 'Mooga Manasulu'… "

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నాగేశ్వర్‌ రావు , సావిత్రి , జమున తో గోదావరి తీరంలో నిర్మించిన సున్నితమైన ప్రేమ కథ. అంతరాల తారతమ్యంతో ఆ ప్రేమికులు మూగగా ఆరాధించుకుంటారు. వారిలో వున్న ప్రేమను మాటల్లో చెప్పుకోలేరు అందుకే సినిమాకు “మూగ మనసులు ” అని టైటిల్ పెట్టారు.

Mooga Manasulu-ANR and Savitri | Cinema Chaat

ఈ సినిమా గురించి 1981 నాటి ఓ ఆసక్తికరమైన సంఘటన నవ్య పాఠకుల కోసం..నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే “జ్యోతి చిత్ర” సినిమా వారపత్రికలో హైదరాబాద్ రిపోర్టర్ గా పనిచేవాడిని. నాకు రామారావు గారు , నాగేశ్వర రావు గారితో బాగా పరిచయం ఉండేది . నాగేశ్వర రావు గారిని తరచూ షూటింగుల్లోనే కాక ఇంట్లో కూడా కలుస్తూ ఉండేవాడిని.

ఆయన సాయంత్రం ఆరు గంటల తరువాత షూటింగ్ చేసేవారు కాదు . ఇంటికి వచ్చి అర్ధాంగి అన్నపూర్ణమ్మ , పిల్లలతో సరదాగా గడిపేవారు. ఒక రోజు నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు . నేను నా పనులు చూసుకొని 7. 00 గంటలకు వెళ్ళాను .అప్పుడాయన తన కార్యాలయంలో కూర్చొని ఏవో ఫోటోలు చూస్తున్నారు . నన్ను చూసి రండి అని ఆహ్వానించారు . అప్పటివరకు ఆయన చూస్తున్న ఫొటోలు నాకు చూపించారు . అవి మూగమనసులు సినిమాలోనివి . ఒకటి నాగేశ్వర రావు , సావిత్రి వున్నది . మరొకటి నాగేశ్వర రావు , సావిత్రి , దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు , కెమెరా సహాయకుడు వున్న ఫోటో .ఆయన వైపు చూశాను.

1964లో నిర్మించిన మూగ‌మ‌నసులు  సినిమా నిజానికి బ్రదర్ రామారావు చేయవలసింది . అయితే ఆయన అవుట్ డోర్ లో షూటింగ్ లో చెయ్య‌న‌న్నాడు . అప్పుడు సుబ్బారావు గారు నన్ను కలసి కథ చెప్పారు . నాకు నచ్చింది . చేస్తాను “అని చెప్పాను. “చిన్న సమస్య వుంది ” అన్నారు సుబ్బారావు గారు .

ఏమిటి చెప్పండి అని సుబ్బారావు గారిని అడిగాను . ఈ సినిమాలో సావిత్రి గారు మిమ్మల్ని” ఏరా ” అని పిలుస్తుంది .”మరి పడవవాడిని అలాగే పిలుస్తుంది .. నాకేం అభ్యంతరం లేదు . పాత్ర లో మనం ఒదిగి పోవాలి తప్ప. మన ఇమేజ్ పాత్ర మీద పడకూడదు ” అని చెప్పాను . ఆయన సంతృప్తి పడ్డారు . “మూగమనసులు సినిమా షూటింగ్ భద్రాచలం లో మొదలై ధవళేశ్వరం వరకు గోదావరిలో సాగింది. ఈ సినిమాకు ఐడియా ఇచ్చింది సుబ్బారావు, కథను విస్తరించినవాడు ముళ్ళపూడి వెంకట రమణ. మాటలు రాసింది ఆత్రేయ . ఇందులో “ఈనాటి ఈ బంధమేనాటిదో ..! అన్న పాట రాసింది ఆత్రేయ . ఈ సినిమాకు మహదేవన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు .

ఈ పాట కొంత భాగం కారులో, మరి కొంత గోదావరి తీరం మీద తీశారు . మా ఇద్దరి మీద షూటింగ్ చేస్తున్నప్పుడు సావిత్రి పొరపాటున నదిలో పడిపోయింది. నిజంగా ఇప్పుడు తలుచుకున్న చమటలు పడతాయి. ఆ సంఘటనతో మరో సారి వచ్చే “ఈనాటి ఈ బంధమేనాటిదో ..! పాటను హైదరాబాద్ శ్రీ సారధి స్టూడియోస్ లో బోటు సెట్ వేసి మరీ చిత్రీకరించారు. ఈ పాట చూసే ప్రేక్షకులు అది గోదావరి అనే భ్రమ కలిపించడానికి సావిత్రి పైట ఎగిరినట్టు చూపించాలి. నేను ఒక కర్రను పట్టుకొని ఆమె వైపు వాలిపోవాలి . ఈ ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది, సావిత్రి పైట అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకున్నాడు. నా చేయి దర్శకుడు సుబ్బారావు పట్టుకున్నాడు . ఈ పాట అంతా సారధి సుడియోస్ లోనే చిత్రీకరించారు దర్శకుడు సుబ్బారావు , కెమెరామన్ పి .ఎల్ .రాయ్ . ” అని వివరించారు నాగేశ్వరరావు.

Watch Mooga Manasulu | Prime Video

“మూగమనసులు ” సినిమా ఘన విజయం సాధించింది . నేని ఈ సినిమాను మావూరుకు దగ్గరలోని ఇంకొల్లు లో చూశాను. ఇందులో కథ, కథనం , మాటలు, పాటలు , సంగీతం , మీరు , సావిత్రి, జమున తో పాటు అందరూ పాత్రోచితంగా నటించారు . ఇప్పటికీ ఆ సినిమా చూస్తే తెలియని అనుభూతి కలుగుతుంది ” అన్నాను.

Mooga Manasulu-balloons | Cinema Chaat

“అవును నాకు ఇష్టమైన సినిమాల్లో మూగమనసులు కూడా ఒకటి . ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది కాబట్టే తమిళం , హిందీ భాషల్లో నిర్మించారు “. ఈ సినిమా షూటింగ్ అంతా గోదావరి మీద ఓ పిక్ నిక్ లా సాగింది ” అని చెప్పారు.

Mooga Manasulu - Alchetron, The Free Social Encyclopedia

కొన్ని సినిమాలు కాలంతో పాటు మరుగున పడవు . తర తరాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆ సినిమాల్లో నటించిన వారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయా పాత్రల ద్వారా మనల్ని పలకరిస్తూనే వుంటారు . అందుకే కళాకారులను చిరంజీవులు అంటారు . అక్కినేని నాగేశ్వర రావు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే వుంటారు .
-భగీరథ

Related posts