నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఒక్క ఏపీలోనే చాలా మంది విదేశాల నుండి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో ఒక ఓటరు 34 సంవత్సరాల తర్వాత ఓటు వేశా! నా ఆనందానికి అవధుల్లేవు .. అంటూ ఫేస్‌బుక్‌లో ఓ ప్రవాసాంధ్రుడు ఆనందాతిశయం వ్యక్తం చేశాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు ఓటు వేశారు.
అమెరికా సహా వివిధ దేశాల నుంచి వచ్చిన దాదాపు 5200 మంది గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి తెలిపారు. నిజానికి, ప్రవాసాంధ్రులకు ఇప్పటివరకూ ఓటు హక్కు లేదు. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం పరోక్ష ఓటింగ్‌కు సంబంధించి బిల్లు తీసుకువచ్చింది. అది రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ఏపీఎన్‌ఆర్టీ ప్రోద్బలంతో అప్పటికే లక్షమందికిపైగా ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో కొందరికి ఓట్లు కూడా వచ్చాయి.
అమెరికా, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి దాదాపు 5200 మంది నేరుగా ఓటు వేసేందుకు కొన్ని రోజుల ముందుగానే ఏపీకి తరలి వచ్చారు. కొందరు ఆయా పార్టీల తరఫున ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ తరఫున 13 జిల్లాల్లోనూ వ్యాన్లు పెట్టి ఓటు చైతన్యంపై ప్రచారం చేశారు. చంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఓటు హక్కు రావడానికి కృషి చేసిన ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరికి పలువురు ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలిపారు.