telugu navyamedia
తెలంగాణ వార్తలు

భరతమాత గుండెకు గాయం అవుతోంది..హిట్లర్‌కి పట్టిన గతే మీకూ ప‌డుతుంది..

*దేశ సంపదను వారి సొంత ఆస్తిలా కేంద్ర అమ్ముతుంది..
*భ‌ర‌త‌మాత గుండెకు గాయ‌మ‌వుతోంది..
*హిట్ల‌ర్ లాంటి వారే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు
*తెలంగాణ‌లో మూడు తోక‌లు లేవు..
*మ‌మ్మ‌ల్ని కూల‌గొడ‌తామ‌ని అంటున్నారు.
*బోర్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని బలవంతం చేస్తున్నారు
*విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలి..

ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింద‌ని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి పోయే కాలం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయం తన వల్ల కాదని రైతులు చేతులెత్తేసే కుట్ర జరుగుతోంది. ధాన్యం కొనాలని అడిగితే కేంద్రమంత్రి అవహేళన చేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అన్నింటినీ అమ్మేస్తోందని, వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయని ధ్వజమెత్తారు.

వేరే పార్టీలను ఉంచబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడొచ్చా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటలతో భరతమాత గుండెకు గాయమౌతుందన్నారు.

గాంధీ, బుద్దుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం నెలకొందన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని బీజేపీ పై కేసీఆర్ మండిపడ్డారు.

భరతమాత గుండెకు గాయం అవుతోంది. అంటే వీరికి పోయే కాలం వచ్చింది. షిండేలు, బొండేలు ఎంత మంది వచ్చినా ఇక్కడ ఎవరు భయపడరు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు.వీళ్లు కాలగర్భంలో కలిసి పోతారు. 

తెలంగాణలో బీజేపీకి మూడు తోక‌లున్నాయి. తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూలదోస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోయే కాలం వచ్చింది కాబట్టే బీజేపీ నేతలు అలా మాట్లాడుతున్నారని కేసీఆర్ చెప్పారు.

ప్రస్తుతం విద్యుత్ శాఖకు దేశ వ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాయి. విద్యుత్ సంస్కరణల వల్ల మొత్తం ఆస్తులు ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం అవుతాయి. డిస్ట్రిబ్యూషన్ల కంపెనీల వద్దే మీటర్లు కూడా కొనుక్కోవాలట. అదో దందా. ఈ విద్యుత్ సంస్కరణల వెనక భయంకరమైన కుట్ర ఉంది. ప్రాణాలు పోయేవరకూ తెగించి పోరాడతాం. అధికారం శాశ్వతం కాదు. ఉంటే ఉంటం లేకుంటే పోతం’’ అని కేసీఆర్ అన్నారు .

ఈ సంద‌ర్భంగా దేశ ప్రధానికి చేతులేత్తి విజ్ఞప్తి చేస్తున్నానని..దయచేసి విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని  కేసీఆర్ అన్నారు. లేదంటే కచ్చితంగా మోడీకి ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Related posts