నగరంలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తాపడింది. ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు మినహా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ నుంచి వస్తున్న బస్సు మొజంజాహి మార్కెట్ సిగ్నల్ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చి లారీ బలంగా ఢీకొట్టింది.
ఆ కుదుపుకి బస్సు బోల్తా పడింది. డ్రైవర్ సహా గాయపడిన ఏడుగురినీ చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.