telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గోరటి వెంకన్నకు శుభాకాంక్షల వెల్లువ..

గవర్నర్‌ కోటాలో నామినేటెడ్‌ శాసనమండలి సభ్యుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు పట్టం కట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, వాసవి సేవా సంస్థ చీఫ్‌ అడ్వైజర్‌ బొగ్గారపు దయానంద్‌ ను ప్రభుత్వం శాసనమండలికి నామినేట్‌ చేసింది. తన ఆట, పాట ద్వారా ఉద్యమానికి ఊపునిచ్చిన గోరటి వెంకన్నను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడం ద్వారా సమున్నత గౌరవం కల్పించింది. ఉమ్మడి ఏపీలో చిట్టచివరి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్య తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్‌ వాసవి సేవా కేంద్రం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

సీఎంకు కృతజ్ఞతలు
గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌లు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమను నామినేట్‌ చేసిన విషయం తెలియగానే వారు శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌కు వచ్చి ముఖ్యమంత్రిని కలువగా, వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ముగ్గురు ప్రగతిభవన్‌లోనే మంత్రి కేటీఆర్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షల వెల్లువ
ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, మాజీ ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ తదితరులు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలతో పాటు, తెలంగాణ ప్రజల కష్టాలను, తెలంగాణ వాణిని వినిపించిన వెంకన్నకు సముచిత స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా మంత్రులు, పార్టీ నేతలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గోరటి వెంకన్నకు ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌ అభినందనలు తెలిపారు.

Related posts