telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేను ఎవ‌రి ప‌ల్లికీ మోయ‌డానికి రాలేదు..ప్ర‌జ‌లను ప‌ల్లికీ ఎక్కించ‌డానికే వ‌చ్చాను..

*వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయం.

*నేను ఎవ‌రి ప‌ల్లికీ మోయ‌డానికి రాలేదు..ప్ర‌జ‌లను ప‌ల్లికీ ఎక్కించ‌డానికే వ‌చ్చాను..
*2024లోరాని ప్ర‌భుత్వానికి పోలీసులు కొమ్ము కాయోద్దు..
*పొత్తులో ఉన్న ప్పుడు 70శాతం ఏకీభ‌విస్తే చాలు..30శాతం అంశాల‌పై విభేదించ‌వ‌చ్చు
*పెరుగుతున్న ధ‌ర‌ల‌ను కేంద్రం త‌గ్గించాలి..

తాము ఎవరి పల్లకీలను మోయడానికి లేమని.. ప్రజలను పల్లకిలోకి ఎక్కించేందుకే జనసేన ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కౌలు రైతులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం పవన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మ‌రోసారి తీవ్ర విమర్శలు చేశారు .

వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు చూసి భరించలేక వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానని.. దానికి వైసీపీ నేతలు ద్వంద్వర్థాలు తీస్తున్నారని పవన్ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని మరోసారి జనసేన కార్యకర్తలు మోసపోవద్దని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ మీద అంత ప్రేమ వైసీపీ నేతలకు అవసరం లేదని సూచించారు . 

ఇటీవ‌ల జ‌రిగిన జనసేన ఆవిర్భావ సభలో తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఏదో సరదాగా చేసిన వ్యాఖ్యలు కాదని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎంతో ఆలోచించి చేసినవని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించే అన్నాను.

 తాము వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వబోమని చేసిన ఒక్క ప్రకటనతో అధికార వైసీపీ నేతలు భయపడిపోతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం అంతా సవ్యంగా చేస్తే వ్యతిరేక ఓటు ఎందుకు ఉంటుందని పవన్ ప్రశ్నించారు.

పొత్తులో ఉన్నామంటే ప్రశ్నించం అని అర్థం కాదన్నారు. పొత్తులో ఉన్న పార్టీతో 70 శాతం అంశాలపై ఏకాభిప్రాయం ఉంటే.. 30 శాతం అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉంటాయని పవన్ అన్నారు. తాను మాట్లాడే ఈ వ్యాఖ్యలకు విపరీతార్ధాలు తీయవద్దని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట‌మి ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. వీళ్లు చేసిన విధ్వంసానికి ఓట్లు అడిగే అర్హత లేదని.. తనకు అనుభవం లేదని మాట్లాడొద్దని పవన్ హెచ్చరించారు

జనసేన పార్టీని ఎలా నడుపుతున్నారని చాలా మంది అడుగుతున్నారని.. అందరినీ ఏకం చేసే భావం జాలం కలిగి ఉంటామని పవన్ తెలిపారు. ఒత్తిళ్లను తట్టుకునే మానసిక స్థైర్యం ఉంటేనే పార్టీని నడపడం సాధ్యమన్నారు. ఈ ప్రయాణంలో జనసేన నేతలు.. కార్యకర్తలే తనకు కొండంత బలమన్నారు. 2007 నుంచి రాజకీయాల్లో వున్నానని.. అనుభవజ్ఞులతో తిరిగానని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి పరిస్దితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండే మాట్లాడుతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన వ్యతిరేకమని పవన్ తెలిపారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనస్సు మార్చుకుంటుందని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయిస్తుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ప్రత్యేక రేట్లకు ఎలా అమ్ముతారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రేట్లు పెంచితే తాగరంటూ తప్పుడు లాజిక్ చెబుతారంటూ సెటైర్లు వేశారు

Related posts