telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

కాలిబాట

brathuku chitram poetry corner

కాలిబాట(ఫుట్టుపాతు)

మీద అతను…చాన్నాళ్ల నించీ
ఎండా, వానా దుమ్మూ ఏదీ
లెక్కచేయక ,అట్టకట్టిన
జుట్టుతో, పట్టాకట్టుకున్న దేహంతో…
పక్కనో సొట్టలుపడ్డ నీళ్లు లేని
సీసాతో…
అడిగినవారు లేరు..నువ్వెవరనీ
అడిగేవారెవరూ ఏమైందీ…అని
ఓ ప్రజాసుపత్రి సమీపం కాబట్టీ
రోగి ఏమో!
లోకం పై విరక్తి పుట్టిన భోగైనా
కావచ్చు..
ఫలానా పార్టీకి జై అంటూ
నడుస్తున్న దండులోంచీ
ఒకడు అతని వద్దకు నడవగా
పొలోమంటు అనుసరించారు
మిగతా….
మేం అధికారంలోకొస్తే నీకు
పట్టుబట్టలూ
ఉచితంగా ఇల్లూ పెళ్లాంపిల్లలూ
తప్పక ఇవ్వగలం
నీఓటు మాకే అంటూ
తమ కరపత్రం అతనికిచ్చాడు
అతను తలూపుతూ
అందుకున్నాడూ…వాళ్లలా
వెనుదిరగ్గానే ఆపత్రం
అతనికి తువాలై ముఖం
తుడిచీ ముడుచుకుపోయి
విసిరేయబడ్డదీ….
అతను…అటూ ఇటూ
చూశాడు సీసాఅందుకున్నాడు
గుక్కెడునీరు లేవందులో
ఇంకో మంద వస్తూ….
అతన్ని సమీపించారు
అయ్యో సాటిమనిషిలా
తిండీతిప్పల్లేకున్నాడు ఏం
ప్రభుత్వం ఏంపాలనా అంటూ
వీడియోతీయించుకునేందుకు
చిందులు తొక్కి పక్కనోడి
చెవులో ఏదో ఊదాడు
చప్పున అతగాడెళ్లి సీసాలో
పట్టుకొచ్చాడూ…
ఆఅనామకునికిస్తూ
నీ ఆకలితీర్చీ నినూహాయిగా
నిద్రపుచ్చే బాధ్యత మాదే
నీఓటు మాకే అంటూ
అందించాడూ
ఆనందంగా తాగిన అతను
హాయిగా నవ్వుతున్నాడూ
వెళ్లిపోతున్నవాళ్లకి సందేహం
మొచ్చిందీ ఇతనికీఊర్లో ఓటుందా…..?అని
అడుగుదామని ఒకడు
మళ్లీ ఆ అనామకునిచెంతకు
వెళ్లాడూ
అప్పటికే అతను ఓట్లకూ
సీట్లకూ ఆటూపోట్లకూ
అతీతమైన మత్తులోకాన
చిత్తుగా విహరిస్తూ
ఇతనివేపైనా చూడలేదు
మరి
జై…ఎన్నికలసమయం

Related posts