భారత మహిళా టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మార్చి 30న తనకు కరోనా సోకిందని ఆమె సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రెండు వారాలు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో తనకు నెగిటివ్ వచ్చిందని హర్మన్‌ప్రీత్ చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ కచ్చితమైన నిబంధనలు పాటించండి అని కోరారు. లక్నోలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా మార్చి 17న జరిగిన చివరి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడారు. ఆ మ్యాచులో 55 బంతుల్లో 30 పరుగులు చేశారు. అయితే గాయం కారణంగా ఆ మ్యాచ్ మధ్య నుంచే తప్పుకున్నారు. అనంతరం జరిగిన టీ20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ ఆడలేదు. పాటియాలాలోని తన నివాసంలో ఉంటున్న ఆమెకు నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ మార్చి 30న కరోనా పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో రెండు వారాలు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకున్నారు. కౌర్ భారత్ తరఫున 2 టెస్టులు, 104 వన్డేలు, 114 టీ20లు ఆడారు.
previous post
next post

