telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నోటాకు ఓటు ఇలా వేయాలి .. అదే బెస్టు అంటున్నాడు ఈ పెద్దాయన..!!

nota effect on telangana elections

రాజకీయాల్లో సిద్దాంతాలు లేని నేతలను పాతరేయాలి, అందుకు నోటా బెస్టు అంటున్నాడు ఒక పెద్దాయన. పార్టీ ఫిరాయింపు నేతల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పెద్ద మనిషి మళ్లీ అదే వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఎలా ఓడించాలి, నోటాకు ఓటు వేసి ఎలా నిరశన తెలపాలి అనే అంశం పై ప్రజల్లో పెద్ద యెత్తున చైతన్యం తెచ్చేందుకు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇంతకీ ఇంతటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎవరు, ఎక్కడ, ఎందుకు అంటే; ఈయన పేరు మాటూరు వెంకటసుబ్బారావు. ఊరు ఖమ్మం. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ నోటాపై ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. పార్టీ మారుతున్న నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారుతున్నారు. ఓటేసిన ప్రజలను మోసగిస్తున్నారు’అంటూ ఆయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

నోటాతో సిద్ధాంతాలు లేని నాయకులకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఈ రాజకీయ నేతలు అవసరం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారులున్నారని చెప్పారు. ‘గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 4,991 ఓట్లు నోటాకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో 12,941 ఓట్లు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో నోటాపై ప్రచారం చేస్తున్నా. మంచి నేతను ఎన్నుకుంటే నీతివంతమైన పాలన వస్తుంది’ అంటూ వెంకటసుబ్బారావు చెప్పారు.

వెంకట సుబ్బారావు చేస్తున్న ప్రచారం వినూత్నంగా ఉండడంతో పాటు నూతన ఆలోచనలు రేకిత్తించేవిగా ఉన్నాయని యువత భావిస్తుండటం విశేషం. పార్టీ ఫిరాయింపుల వెనక ప్రజల మనోభావాలు ఇంతటి స్థాయిలో పెనవేసుకుంటాయా అని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి ప్రజల మనోబావాలను కించపరిచిన నేతలకు నోటాతో బుద్ది చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి మార్పు వస్తే రాజకీయాల్లో కొంతైనా విశ్వసనీయత ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Related posts