telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

అన్న సాయంతో.. కేసు నుండి బయటపడ్డ అనిల్ అంబానీ.. !

mukesh abmabi cleared anil ambani debts

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) అధినేత అనిల్‌ అంబానీ ఎరికన్సన్‌ కంపెనీకి బకాయి చెల్లించి, జైలు కెళ్లకుండా పరువు కాపాడుకోగలిగారు. అయితే తన అన్న ముకేశ్‌ అంబానీ ఆర్థిక సాయం అందించడం వల్లే ఇది సాధ్యమైంది. క్లిష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచారంటూ అన్న ముకేశ్‌ అంబానీ, వదిన నీతా అంబానీలకు అనిల్‌ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు.

సుప్రీంకోర్టు విధించిన గడువుకు ఒక్కరోజు ముందు స్వీడన్‌ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రూ.550 కోట్లను అనిల్‌ చెల్లించడం గమనార్హం. ఎరిక్సన్‌కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.550 కోట్లు చెల్లించేందుకు ఈనెల 19 వరకు సుప్రీంకోర్టు అనిల్‌ అంబానీకి గడువు ఇచ్చిన సంగతి విదితమే. నిధులున్నప్పటికీ, తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో, ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్‌ను గత ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది కూడా.

మార్చి 19 లోపు కనుక బకాయి తీర్చకపోతే, ఆర్‌కామ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీతో పాటు ఆర్‌కామ్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఛైర్మన్‌ చాయా విరానీ, రిలయన్స్‌ టెలికాం ఛైర్మన్‌ సతీశ్‌ సేథ్‌లను కూడా జైలుకు పంపుతామని కోర్టు స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం ఆర్‌కామ్‌ నుంచి రూ.550 కోట్లు ఎరిక్సన్‌కు చేరాయి. ఇంతకుముందు రూ.118 కోట్లు చెల్లించింది.

Related posts