telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సీనియర్‌ జర్నలిస్ట్‌ కొక్కు అహోబలరావు.. బహుముఖ ప్రజ్ఞాశాలి..

senior photo journalist ahobalarao died

ప్రముఖ ఫొటో జర్నలిస్ట్‌ కొక్కు అహోబలరావు (75) మృతి చెందారు. విద్యార్థి దశలోనే కళాశాల బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌గా ఎన్నికైన ఆయన ఆ తరువాత ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నారు. ముంబయి జెవియర్‌ కళాశాలలో ఫొటోగ్రఫీలో డిప్లమో పొందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ కె.వి.నాయుడు కుమారుడైన ఆయన విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివారు. 1950లో నగరంలో బొంబే స్టూడియో స్థాపించారు. వీడియోగ్రఫీలోనూ ప్రత్యేకత చాటుకున్నారు. పది కిలోల బరువుగల ఫీల్డ్‌ కెమెరా ద్వారా గ్రూప్‌ ఫొటోలను తీస్తూ రికార్డు సష్టించారు. పత్రికా ఫోటోగ్రాఫర్‌గా విశిష్ట సేవలు 1963లో ఆంధ్రజ్యోతి ప్రెస్‌ ఫొటోగ్రాఫర్‌గా చేరి 1980 వరకూ పనిచేశారు.

ఇదే సమయంలో పలు తెలుగు పత్రికలతోపాటు ది హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి ఆంగ్ల పత్రికలకు కూడా ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌గా ఉన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పాల్గొన్న కార్యక్రమాల నుంచి మరో ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి కార్యక్రమాలనూ కవర్‌ చేశారు. 1977లో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు అక్కడ నెలకొన్న హదయ విదారక దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా పలు మ్యాగజైన్లలోనూ, దినపత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రికలోనూ ప్రముఖంగా ప్రచురించ బడ్డాయి.

అహోబలరావు మృతికి ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వెంకట్రావు, జి.ఆంజనేయులు సంతాపం తెలిపారు.ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అహోబలరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌ సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు ఎపిపిజెఎ అధ్యక్షులు ఎన్‌ సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి రుబిన్‌, సహాయకార్యదర్శి సుమన్‌రెడ్డి, కోశాధికారి టివి రమణ ఓ ప్రకటన విడుదల చేశారు.

Related posts