telugu navyamedia
క్రీడలు వార్తలు

కేఎల్ రాహుల్ : ఆ రోజు రాత్రి..

ఐపీఎల్ 2020 లో గత ఆదివారం ముంబయి, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఎంత ఉత్కంఠగా సాగిందో తెలిసిందే. రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత పంజాబ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌ తర్వాత తన పరిస్థితి గురించి పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్ వెల్లడించాడు. సూపర్‌ ఓవర్‌ ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి తాను నిద్రపోలేదని రాహుల్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌ను అంత వరకూ తీసుకువెళ్లాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. సూపర్‌ ఓవర్‌ వరకూ రావడంతోనే తీవ్ర ఒత్తిడి గురయ్యామని వెల్లడించాడు. అయితే.. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్‌ కూడా 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేయగలిగింది. రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. నిబంధనల ప్రకారం సూపర్‌ ఓవర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఓవర్ ‌లోనూ స్కోర్లు సమం కావడంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఆ ఓవర్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ మరో రెండు బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో పంజాబ్‌ పైచేయి సాధించింది.

Related posts