telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారీ వర్షాలతో అల్లాడిపోతున్న ఉత్తరప్రదేశ్ .. 47మంది మృతి..

huge rain in utharpradesh costs 47 lives

భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. లక్నో, అమేథీ, హార్దోరు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు కూడా నేలకొరిగాయి. 24 గంటల వ్యవధిలో జరిగిన వివిధ ఘటనల్లో 47 మంది మృత్యువాత పడినట్లు అధికారులు శనివారం తెలిపారు. గోడలు కూలడం, పాము కాట్లు, వరదల్లో కొట్టుకుపోవడం, పిడుగు పాటు వంటి ఘటనల కారణంగా ఈ మరణాలు సంభవించాయని విపత్తు నిర్వహణాధికారి ఒకరు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాద్‌ ఉన్నతాదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎటువంటి సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని, నిరాశ్రయులకు వెంటనే సాయం చేయాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని, వరద నష్టంపై అంచనా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియోను రూ.4 లక్షలకు పెంచాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సిఎం సూచించారని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో లక్నోలో 76.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

Related posts