telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

స్థానిక ఎన్నికలు : రెండో దశ .. పోలింగ్ నేడే..

election notifivation by 12th said ec

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు మూడు దశల ఎన్నికల్లో భాగంగా.. రెండో దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండోదశ పోలింగ్‌ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై 218 ఎంపీటీసీ స్థానాల్లో తప్ప మిగతా అన్ని చోట్లా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మావోయిస్టుల ప్రభావం ఉన్నట్టుగా గుర్తించిన 218 స్థానాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. రెండో దశలో ఏకగ్రీవాలు పోగా 1,850 ఎంపీటీసీలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. వీటిలో రెండు తప్ప మిగతా అన్నింటిలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌తో సహా మిగతా పార్టీల వారు కొన్నేసి స్థానాలకే పరిమితమయ్యారు. తెరాస అభ్యర్థులు కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులతో పోటీపడుతున్నారు.

రెండో దశలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయిస్తే మిగతా 1,850 ఎంపీటీసీలకు పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మావోయిస్టుల ప్రభావం ఉంటుందని గుర్తించిన.. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 218 ఎంపీటీసీల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. ఇవి తప్ప మిగతా అన్ని చోట్ల ఓటర్లు సాయంత్రం 5 గంటలవరకు ఓట్లను వేయవచ్చు. రాష్ట్రంలో మండుటెండలు ఉన్నప్పటికీ తొలి దశ పోలింగ్‌లో 76 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటంతో.. రెండో దశలోను పోలింగ్‌ శాతం దాదాపు అదేమాదిరిగా ఉండొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. తొలిదశలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటర్లు బారులు తీరారు.

రెండో దశ ఎన్నికల బరిలో మొత్తం 6,083 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎన్నికలను నిర్వహిస్తున్న 1,850 ఎంపీటీసీల్లో అత్యధికంగా 1,848 స్థానాల్లో తెరాస అభ్యర్థులను నిలిపింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ 1,698 స్థానాలకే పరిమితమైంది. భాజాపా 895, తెదేపా 173, సీపీఐ 87, సీపీఎం 92 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. వైకాపా ఒక్క స్థానంలోనూ పోటీచేయటంలేదు. ఎంఐఎం మూడు చోట్ల బరిలో ఉంది. మొత్తం 1,249 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. జడ్పీటీసీ స్థానాలు రెండో దశలో 180 ఉండగా.. వాటిలో ఒకటి ఏకగ్రీవం కావటంతో మిగతా 179 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటి కోసం మొత్తం 805 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెరాస అన్ని స్థానాల్లోను పోటీపడుతుండగా..కాంగ్రెస్‌ 177, భాజాపా 148, తెదేపా 60, సీపీఐ 20, సీపీఎం 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. మొత్తం 162 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.

Related posts