telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో కూడా..జీరో ఎఫ్ఐఆర్ .. తక్షణమే అమలు.. ఆదేశాలు జారీ…

zero fir in action in andhrapradesh

దిశ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ జీరో ఎఫ్ఐఆర్ పై దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేసే విధంగా జీరో ఎఫ్ఐఆర్ ను అందుబాటులోకి తీసుకురావాలని చర్చ జరుగుతున్న వేళ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు మానవ మృగాల పైశాచిక దాడికి బలైపోయిన దిశ సంఘటన నేపధ్యంలో ఏపీలో కొత్త విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో కూడా జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు జీరో ఎఫ్ఐఆర్ పై దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ, ముంబై రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో కూడా జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చామని ఆ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అత్యవసర కేసులలో ఈ విధానాన్ని అన్ని పోలీస్ స్టేషన్ లలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి డిజిపి ఆఫీస్‌ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్‌ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే అంశాలపై ఒక రోజు సదస్సును నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలపై మాట్లాడారు. అసలు జీరో ఎఫ్ ఐ ఆర్ అంటే ఏమిటి అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే జీరో ఎఫ్ఐఆర్. ఘటనా ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అనే దానితో నిమిత్తం లేకుండా ఎక్కడైనా కేసు నమోదు చేయడానికి ఉండే వెసులుబాటే జీరో ఎఫ్ఐఆర్.

నేరం జరిగిన ప్రదేశం యొక్క పరిధి తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అలా నమోదయ్యే ఎఫ్ఐఆర్ నంబర్ ను జీరో గా పరిగణిస్తారు. ఆ తర్వాత నేను దొరికిన ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ కు ఈ ఫిర్యాదును బదిలీ చేస్తారు. సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి విచారణ నిర్వహిస్తారు. తాజాగా దిశ హత్యకు ముందు పోలీసులు తమ పరిధిలోకి రాదని కంప్లెయింట్ తీసుకోవడానికి చాలా సమయం వృథా చేశారని, బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తీసుకుని విచారణ ప్రారంభిస్తే, ఇప్పుడు ఇంత దారుణం జరిగి ఉండేది కాదని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఏపీలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదనే ముందు జాగ్రత్తగా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బాధితులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని, మహిళల ,అమ్మాయిల రక్షణ కు పెద్ద పీట వేస్తూ ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts