telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ అధిష్టానం విజయసాయి రెడ్డికి మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించ‌గా..లాయ‌ర్ నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు,

బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణయ్య కు అవ‌కాశం క‌ల్పిస్తూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.ఈ న‌లుగురు సీఎం జ‌గ‌న్‌తో భేటి అయిన తరువాత సీఎం జగన్ వారి పేర్ల‌ను ప్ర‌క‌టించారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజ్యసభకి తెలంగాణ, ఏపీ అనే తేడా లేదని బొత్స అన్నారు. . రాజ్యసభకు ఎవరిని పంపుతున్నామనేదే ముఖ్యమని బొత్స తెలిపారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆర్ కృష్ణయ్యకి సీఎం జగన్ రాజ్యసభ అవకాశం ఇచ్చారని అన్నారు.

జాతీయ స్థాయిలో బీసీల వాయిస్ ని వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అని, ఆయనకి తెలంగాణ, ఆంధ్ర అనే బేధం లేదని మంత్రి బొత్స చెప్పారు.

అయితే.. ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావుల ఎంపికపై ఇప్పటికే విమర్శలు ఎదురవుతున్నాయి.

నిరంజన్ రెడ్డి లాయర్. ఆయన సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను వాదిస్తూ ఉంటారు. ఇటీవల చిరంజీవితో ఆచార్య సినిమాను కూడా నిర్మించారు. వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలతో తన లాయర్‌కు జగన్ రాజ్యసభకు చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది.  

మరో రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు నెల్లూరు జిల్లా కావలికి చెందిన నేత.  దీనికి తోడు బీద మస్తాన్ రావు బీసీ అభ్యర్దే అయినా.. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. గత ఎన్నికల తర్వాత రాజ్యసభ హామీతోనే వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు బీసీ కోటా కింద చాన్సిచ్చారు. 

ఇక మరో స్థానానికి తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు అవకాశం ఇచ్చారు.  గతంలో ఆర్ కృష్ణయ్య టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్నారు.. 

దీంతో ఏపీలో బీసీ అభ్యర్థులే లేరా.. తెలంగాణ వ్యక్తికి ఎందుకు పదవి ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

Related posts