నెల్లూరు వైసీపీలో వర్గపోరు మరోసారి బట్ట బయలైంది. పేరు చెప్పకుండా సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి అనిల్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి.
గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆయన.. తనపై సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఓ నాయకుడు వైసీపీలోనే ఉంటూ సొంతపార్టీకి అన్యాయం చేస్తున్నాడంటూ విమర్శించారు. నీతిమాలిన పనులు చేస్తూ.. టిడిపికి కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు.
వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నాయకులతో నిత్యం చర్చలు జరుపుతున్న వారి లిస్ట్, ఫోస్ కాల్ హిస్టరీ తన దగ్గర ఉందని.. ఆధారాలు అన్నింటిన్ని త్వరలోనే బయటపెడతానని , మీ దగ్గర నుంచి ఎంతెంత నగదు వెళ్తుందో అన్నీ నాకు తెలుసు అని వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తన తొలి కేబినేట్ లో అనిల్ కుమార్ యాదవ్ కి ఇరిగేషన్ శాఖా మంత్రిగా అవకాశం కల్పించారు. . మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో అనిల్ కుమార్ కు ఉద్వాసన పలికి.. అదే జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు.. ఆతర్వాత నుంచి నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్థన్, అనీల్ కుమార్ యాదవ్ కు పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ కుమార్ కూడా బహిరంగంగానే కాకాణి గోవర్థన్ రెడ్డిపై విమర్శలు చేయడం.. ఆతర్వాత పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరి నేతలతో మాట్లాడి తగదాలు లేకుండా కలిసి పనిచేయాలని సూచించారు. ఆతర్వాత కొద్ది రోజులు కూల్ గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్..
తాజాగా నెల్లూరులో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అలాగే త్వరలోనే పార్టీలో ఉంటూ పార్టీకి వెన్ను పోటు పొడిచే వారి పేర్లు బయటపెడతానని చెప్పడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.