telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తాము: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాష్ట్రాన్ని ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌-2025’ను సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అనంతరం వివిధ రంగాల నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. హరిత ఉదజని(గ్రీన్‌ హైడ్రోజన్‌) రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలంటే ప్రస్తుతం కేజీకి రూ.400 ఖర్చు అవుతోందని, దీనిని రూ.100లోపు ఖర్చుకు తీసుకొచ్చినప్పుడే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేేసలా కొత్త సాంకేతికను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని సూచించారు.

వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాధాన్యం పెరిగిందన్నారు.

పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని దీని ఉత్పత్తి పెద్దఎత్తున జరగాలని సీఎం చెప్పారు. 2070 నాటికి కార్బన్‌ రహిత ఇంధనాలు వాడాలన్నది జాతీయ లక్ష్యమని పేర్కొన్నారు.

తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్‌ తయారీ, నిల్వ చేయడంపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌, పరిశోధన, ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.

Related posts