ప్రజలు స్తబ్దుగా ఉంటె నాయకులు ఎన్ని గెంతులైన వేస్తారు అనేది స్పష్టం అవుతుంది. ఇష్టానికి పొత్తులు.. ఇష్టానికి జంపింగులు .. పైగా ఇవన్నీ రాజకీయాలలో సహజం అంటూ స్టేట్మెంట్లు. ఈ తరహా రాజకీయాలు ఇటీవలే కర్ణాటకలో చూశాం, అదే తరహా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. అధికార వైసీపీ పై నెగ్గడానికి మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో వైఎస్ జగన్ ను ఢీకొట్టాలంటే.. మళ్లీ ముగ్గురు జత కట్టాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత, మాజీ మంత్రి అందునా చంద్రబాబు సన్నిహితుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడీ చర్చకు తెరలేపాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు చేతులు కలపనున్నాయానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 2022 లో జమిలీ ఎన్నికలు జరిగినా. లేదా 2024లో ఎన్నికలు జరిగినా బద్ధ శత్రువులైన ఈ పార్టీలన్నీ ఒక్కటై వైసీపీని ఓడించేందుకు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తాయా ? అన్న డౌట్లు ఇప్పటికే ఉన్నదే.
రాజకీయాల్లో పొత్తుల విషయంపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయని అయ్యన్న జోస్యం చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తి చూపిస్తున్నారన్న ఆయన.. ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగిస్తోందన్న ఆరోపణలకు బలం చేకూర్చాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీతో దోస్తీ కొనసాగించారనే వార్తలు జోరుగా వినిపించాయి. మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలోకి చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ పొత్తుపై చర్చల రచ్చ జరిగిన తర్వాత.. అయ్యన్నవివరణ ఇవ్వాల్సి వచ్చింది. మూడు పార్టీలు కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి, కలిసి పోటీ చేస్తాయని తాను అనలేదు అన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మాత్రమే అన్నాను అని వివరించారు. ఏది ఏమైనా అయ్యన్న సీనియర్ నేత. పైగా చంద్రబాబుకి సన్నిహితుడు. సో.. నోటికొచ్చినట్టు వాగడానికి అయ్యన్నేమీ లోకల్ లీడర్ కాదు. ఆయన మాటలను తీసిపారేయడానికి అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి అయన్న చెప్పింది ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.