telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాము: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

ఏలూరు జిల్లాలో ‘పేదల సేవలో’ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బాబాయిని గొడ్డలితో చంపి వేరే వారిపై నెపం నెట్టే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

తలసరి ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 58 లక్షలకు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

కొందరు నటనతో కష్టపడుతున్నట్లు కనిపిస్తారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

అమరావతిని కూడా ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మార్చబోతున్నామని అన్నారు. మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని తెలిపారు. గత పాలకుల ఐదేళ్ల హయాంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.

గత ఐదేళ్ల పాలనకు, కూటమి 18 నెలల పాలనకు వ్యత్యాసం ఉందని అన్నారు. జనవరిలోగా రాష్ట్రంలో గుంతల రోడ్లన్నీ పూడ్చి బాగు చేస్తామని, అవసరమైతే కొత్త రహదారులు నిర్మిస్తామని అన్నారు.

రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసి ఎక్కువ ప్రయోజనం పొందాలని సూచించారు. సమీకృత వ్యవసాయ విధానాలను అవలంభించాలని అన్నారు.

డ్రోన్ సాంకేతికతను వినియోగించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించుకుని, దిగుబడి పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.850 కోట్లను భరిస్తోందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు.

కొబ్బరి, కోకో, కాఫీ వంటి పంటలు ఉన్నాయని, కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి ఇస్తామని మాట ఇచ్చి దానిని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని వెల్లడించారు.

ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి ఎద్దడి సమస్య ఉండదని ఆయన అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని అన్నారు.

అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని చంద్రబాబునాయుడు అన్నారు.

Related posts