telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గణేష్‌ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోవిడ్‌ ఉధృతి ఇంకా తగ్గలేదని.. మండపాల ఏర్పాటు వలన కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని పిటిషనర్ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గణేష్‌ మండపాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని రేపటిలోగా వెల్లడిస్తామని తెలిపారు. అయితే, ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 11 కు వాయిదా వేసినట్లు హైకోర్టు ప్రకటించింది.

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది వినాయక చవితితో పాటు ఏ పండుగనూ వైభవంగా జరుపుకోలేకపోయాం. అయితే కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు జరపాలని హైదరాబాద్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రణాళికను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 10 నుంచి ఉత్సవాలు మొదలవుతాయని సెప్టెంబర్ 19న గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 40 అడుగుల ఎత్తులో శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో దర్శనమివ్వనున్నాడు.

Related posts