telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం-పార్లమెంట్ సాక్షిగా తేల్చిచెప్పిన కేంద్రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.
మంగళవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. అయితే విభజన చట్టంలో మరికొన్ని హామీలు మాత్రం మిగిలే వున్నాయని కేంద్రం అంగీకరించింది. రానున్న రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు.

Related posts