telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నజరానా ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దు: టీఆర్ఎస్ఏంఏ విజ్ఞప్తి

half day schools in AP since high temp

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల కొరకు వాట్స్అప్ ల ద్వారా చేస్తున్న ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏంఏ ) ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పైచిలుకు విద్యార్థులతో , 5 లక్షల పై సిబ్బందితో తెలంగాణ రాష్ట్ర విద్యార్థినీ విద్యార్థుల విద్యా అభివృద్ధికి తద్వారా రాష్ట్ర సర్వోన్నతాభివృద్ధికి కొన్ని దశాబ్దాలుగా నిరంతరం శ్రమిస్తూ, ప్రతి సంవత్సరం దీనికై పునరంకితమవుతూ ప్రైవేటు విద్యాసంస్థలు నడుపుతున్న విషయం మీ అందరికీ విదితమే.

ప్రస్తుత తరుణంలో ఇవి కోవిడ్ సెలవులు. ఇవి కేవలం కోవిడ్ సెలవులు మాత్రమే, తదనంతరం పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని విశ్వసిస్తున్నాం.ఈ విపత్కర అ సమయంలో విద్యాసంస్థలపై మేకవన్నె పులుల వలే శ్రీ చైతన్య నారాయణ మరియు ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల కొరకు అనేక నజరానాలు ప్రకటిస్తూ , అడ్మిషన్ ఫీజు లేదు ,డొనేషన్ ఫీజు లేదు అంటూ కేవలం వ్యాపార దృక్పథంతో తల్లిదండ్రులైన మిమ్మలను మోసం చేయుటకు ఆన్లైన్ ద్వారా, ఫోన్ల ద్వారా, ఎస్ఎంఎస్ మరియు వాట్స్అప్ ల ద్వారా మిమ్మల్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు .

ఇటువంటి వ్యాపార ఎత్తుగడలను, వారు చూపిస్తున్న నజరానా ఎరను చూసి మోసపోవద్దని, పై పై మెరుగులతో కేవలం బంగారు పూత వంటి వారి పని విధానం తో విద్యార్థులకు ఒనగూరే లాభం ఏమీ లేదు అని స్థానిక విద్యావేత్తలు గా మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. వారి రిజల్ట్స్ ప్రకటనల అంకెల గారడీలు , మాయమాటలు మీరు లొంగ వద్దని అందుకు మీరు బలి కావద్దని సోదర ప్రేమతో హెచ్చరిస్తున్నాం.

గౌరవ తల్లిదండ్రులారా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, మీ పిల్లలు గతంలో ఏ పాఠశాలలో చదువుతున్నారో, ఆ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం తో కలిసి ఉన్నారో వారితోనే ఉండమని , కలిసి ముందుకు సాగమని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుమారుగా 20 నుండి 30 టీవీ ఛానల్స్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ నడుపుటకు ఏర్పాటు చేయుచున్న ఈ సమయంలో ఇల్లే ఒక పాఠశాల గా, మీరే గురువులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడబోతున్నది.

దైవ ఆశీర్వాదంతో పరిస్థితులు త్వరగా చక్క పడాలని తిరిగి పాఠశాలలు యధావిధిగా నడవాలని కోరుకుంటున్నాం. అప్పటివరకు మీరు జాగురూకతతో ఉండి ఎటువంటి ప్రలోభాలకు లొంగక ప్రస్తుతం మీ పిల్లలు ఉన్న పాఠశాలలోనే ఉంచి విద్యా సంస్థలకు తోడ్పాటును అందించాలని కోరుతున్నాము.

ప్రైవేటు విద్యాసంస్థల గా మేము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని విద్యావసతులు, పాఠాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించుటకు ప్రయత్నిస్తూ విద్యాభివృద్ధికి పాటు పడతామని మరొకసారి మనవి చేస్తున్నామని టీఆర్ఎస్ఏంఏ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, కార్యదర్శి S.మధుసూదన్, కోశాధికారి పి . నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

Related posts