telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ… 59 ఏళ్ళ తరువాత ఇలా…!

Monsoon

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. అక్టోబర్ 10 నుంచి నైరుతి నిష్క్రమణ ప్రారంభమైంది. బుధవారం పంజాబ్‌, హర్యానా, ఉత్తర రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఈ ఏడాది నైరుతి వెనక్కి మళ్లడం ఆలస్యమైంది. 1961లో అక్టోబరు 1న, 2007లో సెప్టెంబరు 30న నైరుతి నిష్క్రమణ జరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత నైరుతి ఆలస్యంగా వెనక్కి మళ్లుతుండటం గమనార్హం. అక్టోబరు 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉంది. కానీ హిందుమహా సముద్రంలో అల్పపీడనాల ప్రభావంతో అక్టోబర్ 20 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సాధారణం కంటే 40 రోజులు ఆలస్యంగా నైరుతి వెనక్కి మళ్లుతోంది. నైరుతి విస్తరణ కూడా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఆరంభంలో రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండటంతో.. జూన్, జూలై నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. కరవు తప్పదేమో అనిపించింది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విపరీతమైన వర్షాలు కురిశాయి. అక్టోబర్లోనూ వానలు కురుస్తున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా సగటున 86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది పది శాతం అధికం కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో నమోదైన వర్షపాతం వివరాలు..

ఏపీలో సాధారణంగా 514.4 మి.మీ. వర్షం కురవాల్సిన ఉండగా.. 565.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది పది శాతం అధికం. కోస్తాంధ్రలో 586.9 మి.మీ.కి గానూ 641.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 9 శాతం ఎక్కువ. రాయల సీమలో 411.6 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 460.0 మి.మీ. వర్షం కురిసింది. ఇది 12 శాతం ఎక్కువ కావడం గమనార్హం. తెలంగాణలో సాధారణ వర్షపాతం 759.60 మి.మీ. కాగా.. సెప్టెంబర్ 30 నాటికి 805.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఇది ఆరు శాతం ఎక్కువ కావడం విశేషం. ఏపీలోకి జూన్‌ తొలి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు జూన్‌ 21న ప్రవేశించాయి. రాయలసీమలో సెప్టెంబరు మొదటి వారం వరకు సరైన వర్షాలు పడలేదు. కానీ మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరదలొచ్చి.. ప్రాజెక్టులు నిండాయి. కానీ వర్షాల లేమితో తెలుగు రాష్ట్రాల్లోని చెరువులు మాత్రం నిండలేదు. నైరుతి సీజన్‌ చివరి నాటికి వర్షాలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో మిగులు వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ భారీగా వర్షాలు కురవడంతో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతంలో చెరువులు నిండాయి.

Related posts