telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వాట్సాప్‌లో బదిలీ సమాచారం… పరుగులు తీసిన న్యాయమూర్తి..

mail provided by dot for whatsapp affected

ఓ కేసులో విచారణ జరుగుతుండగా వాట్సాప్‌లో తనకొచ్చిన బదిలీ మెసేజ్‌ను చూసిన న్యాయమూర్తి విచారణను అర్థాంతరంగా నిలిపివేశారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిందీ ఘటన. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ పంజాబ్ చీఫ్, న్యాయశాఖ మాజీ మంత్రి రానా సనావుల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లాహోర్‌లోని నార్కోటిక్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది. మసూద్ అర్షద్ న్యాయమూర్తిగా ఉన్నారు. కేసు విచారణ జరుగుతుండగా జడ్జి అర్షద్‌కు వాట్సాప్‌లో ఆయనను బదిలీ చేసినట్టు మెసేజ్ వచ్చింది.

వెంటనే ఆయనీ విషయాన్ని కోర్టులో చెబుతూ.. తనకు వాట్సాప్‌లో ట్రాన్స్‌ఫర్ ఆదేశాలు అందాయని, లాహోర్ హైకోర్టుకు బదిలీ చేశారని, కాబట్టి కేసు విచారణను కొనసాగించలేనంటూ విచారణను అర్థాంతరంగా ముగించారు. దీంతో తెల్లబోవడం న్యాయవాదుల వంతైంది. సనావుల్లా కారు నుంచి 15 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోసం సనావుల్లా కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ న్యాయచరిత్రలో ఇదో బ్లాక్ డే అని సీనియర్ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసులో తనకు ఇష్టమైన న్యాయమూర్తిని నియమించేందుకే ప్రభుత్వం అర్షద్‌ను అకస్మాత్తుగా బదిలీ చేసిందని మరికొందరు ఆరోపిస్తున్నారు.

Related posts