telugu navyamedia
క్రీడలు

ఒలంపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు రెండో మెడల్ వచ్చింది. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోతో జరిగిన పోరులో భారత క్రీడాకారిణి పీవీ సింధు చెలరేగిపోయింది. భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు కాంస్య పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో బింగ్‌ జియావోపై గెలిచింది. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. తాజా ఒలింపిక్స్‌లో కూడా పతకం సాధించి భారత అభిమానులు పెట్టుకున్న ఆశల్ని వమ్ముచేయలేదు. దాంతో భారత రాష్ట్రపతితో సహా పలువురు సింధూకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక సింధూ పతకం గెలవడంపై తన తండి రమణ స్పందిస్తూ… బ్రాంజా.. సిల్వరా… గోల్డ్… కాదు.. పతకం ఏదైనా పతకమే.. సింధు దేశం కోసం ఆడింది… దేశానికి మెడల్ తెచ్చిపెట్టింది. నిన్న రాత్రి కాల్ చేసి మాట్లాడింది… పోయిన మ్యాచ్ గురించి వదిలేయ్. మరొక మెడల్ నీముందు ఉంది. అది సాధించే దిశగా ఆడమని ధైర్యం చెప్పాం అని పేర్కొన్నారు.

Related posts