telugu navyamedia
సినిమా వార్తలు

ఈరోజు హరి కృష్ణ 85వ జయంతి

ఈరోజు గాంధీ జయంతి. దేశమంతా ఆ మహనీయుని స్మరించుకుంటుంది. తెలుగు సినిమా రంగంలో విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవితాంతం పాటించిన మానవతావాది యలమంచి హరికృష్ణ 85వ జయంతి. అభిరుచి కలిగిన హరి కృష్ణ సామాజిక స్పృహ తో నిర్మించిన సినిమాలు అనేక అవార్డులను , విమర్శకుల ప్రశంశలను అందుకున్నాయి.

సినిమా రంగంలో ఆయన వారసులు ఎవరూ లేరు. ఆయన తండ్రి వామపక్ష భావాలున్న కమ్యూనిస్టు నాయకుడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే అనుకోని సంఘటనతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే కుటుంబ బరువు , బాధ్యతలు హరికృష్ణ తీసుకున్నారు. అలా సినిమా రంగంలోకి తెలియకుండానే వచ్చారు.

ఉద్యోగినా ప్రారంభమైన ఆయన జీవిత ప్రస్థానం అనూహ్యంగా జరిగింది. తెలుగు సినిమా రంగంలో పంపిణీదారుగా, నిర్మాతగాఎదిగి ఒదిగిన మానవతావాది, విలువలతో చివరి వరకు బ్రతికిన ఉత్తమోత్తముడు హరి కృష్ణ . ఎందరికో స్ఫూర్తినిచ్చే యలమంచి హరికృష్ణ జీవితం గురించి తెలుసుకుందాం. ఐదు దశాబ్దాల సినిమా.

జీవితంలో గ్రామర్ తప్ప గ్లామర్ ను వంటపట్టించుకొని మంచి మనిషి, ఉత్తమాభి రుచులు కలిగిన వ్యక్తి యలమంచి హరికృష్ణ. తండ్రి నేర్పిన సంస్కారం, నడిచిన మార్గాన్ని జీవిత చరమాకం వరకు మర్చిపోకుండా ఆచరించిన హరికృష్ణ పంపిణీరంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ, చిత్ర రంగ సంస్థల నిర్వహణలోనూ తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి , ప్రభావశీలి. కృష్ణ జిల్లా మేడూరు గ్రామంలో యలమంచి వెంకట కృష్ణయ్య , సరస్వతి దంపతులకు కస్తూరిబాయి, విద్యావతి తరువాత మూడవ సంతానంగా హరికృష్ణ అక్టోబర్ 2, 1936వ సంవత్సరంలో జన్మించారు.

వెంకటకృష్ణయ్య తొలుత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే అప్పట్లో ఆంధ్ర దేశంలో కమ్మూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. కమ్మూనిస్టుల భావాలు, సిద్ధాంతాలకు ఆనతి యువకులు ఎక్కువ ఆకర్షితులు అవుతుండేవారు. వెంకట కృష్ణయ్య కూడా కమ్మూనిస్టు నాయకుల విన్యాసాలకు ప్రభావితమై ఆపార్టీలో చేరారు.

కమ్మూనిస్టు భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వెంకట కృష్ణయ్య పనిచెయ్యడం మొదలు పెట్టారు. కుటుంబానికి దూరంగా ఉంటూ పార్టీకే అంకితమైన వెంకట కృష్ణయ్య అనతి కాలంలోనే నాయకుడుగా ఎదిగారు . ఆయన ఉపన్యాసాలకు ప్రజలు స్పందించడం మొదలు పెట్టారు. సరిగా అప్పుడే ఆయన ప్రభుత్వము దృష్టిలో పడ్డాడు. పోలీసుల వేట మొదలైంది. ఆయన వారి నుంచి తప్పించుకోవడం కోసం అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలించడం మొదలు పెట్టారు.

చివరకు వెంకట కృష్ణయ్య ఆచూకి కనిపెట్టిన పోలీసులు ఆయన్ని బంధించి కాల్చివేశారు. ఊహించని ఈ ఘటన ఆ కుటుంబాన్ని కలవరపెట్టింది , కన్నీరు కార్పించింది . వెంకట కృష్ణయ్య కు ముందే తల్లి సరస్వతి చనిపోవడంతో పిల్లల ఆలనాపాలనా నాయనమ్మ చూస్తుంది. కమ్మూనిస్టు నాయకులు వచ్చారు, కుటుంబాన్ని ఓదార్చారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అప్పుడు హరికృష్ణ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అప్పటికే ఇద్దరు అక్కల వివాహం జరిగింది. అక్కలు , నాయనమ్మ వారిస్తున్నా , ఇక చదువు కొనసాగించమని, ఉద్యోగం చూసుకొని కుటుంబానికి సహాయపడతానని విజయవాడ వెళ్లిపోయారు. అదే హరికృష్ణ జీవితాన్ని మలుపు తిప్పింది. విజయవాడ వెళ్లిన తరువాత తెలిసినవారి ద్వారా నవయుగ సినిమా పంపిణీ సంస్థలో రిప్రజెంటిటివ్ గా చేరారు.

ఆరోజుల్లో సినిమా రెప్రజెంటిటివ్ ను థియేటర్ యజమానులు ప్రలోభపెట్టి అక్రమార్జన చేస్తుండేవారు. అయితే హరికృష్ణ నిజాయితీగా పనిచేసేవారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగేవారు కాదు. 12 సంవత్సరాలు నవయుగ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. అప్పట్లో పంపిణీ సంస్థల యజమానులు హరికృష్ణను బాగా అభిమానించేవారు. అలా కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్ర జ్యోతి పత్రిక యజమాని, లక్ష్మీ ఫిలిమ్స్ అధినేత కె .ఎల్ .ఎన్ . ప్రసాద్ దృష్టిలో పడ్డారు. 1968లో ప్రసాద్ గారి ఆహ్వానంతో లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ సంస్తలో మేనేజర్ గా చేరారు. ఈ మార్పు హరి కృష్ణను సినిమా రంగానికి మరింత చేరువ చేసింది. లక్ష్మీ ఫిలిమ్స్ కొక స్థాయిని తీసుకురావడంలో హరికృష్ణ గణనీయమైన పాత్ర నిర్వహించారు.

నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు, దర్శకుడు తాతినేని రామా రావు , హీరో శోభన్ బాబు సహాయ సహకారం , ప్రోత్సాహంతో 1977 వ సంవత్సరంలో సికిందరాబాద్ లో హరి కృష్ణ “శ్రీ లక్ష్మీ చిత్ర ” పంపిణీ సంస్థను మొదలు పెట్టారు. దీనికి పద్మశ్రీ నందమూరి తారక రామారావు స్వహస్తాలతో ప్రారంభించారు.

తెలుగు సినిమా రంగంలో వున్న ఎంతో మంది నటులు, నిర్మాతలు, దర్శకులు వచ్చి హరి కృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సంవత్సరానికి విజవాడలో లక్ష్మీ చిత్ర పంపిణీ సంస్థను నెల కొల్పారు. అటు వ్యాపార సినిమాలతో పాటు, అభిరుచి కలిగిన సినిమాలు, వామ పక్ష సినిమాలు, సామాజిక స్పృహతో నిర్మించిన సినిమాలకు చేయూతనివ్వడం లో హరికృష్ ముందుండేవారు.

కేవలం వ్యాపారమే ప్రధానంగా చూసేవారు కాదు. అందుకే హరికృష్ణ కు ఆనతికాలం లోనే గుర్తిపు, గౌరవం వచ్చాయి. 1984వ సంవత్సరంలో కృష్ణ చిత్ర అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి టి కృష్ణ దర్శకత్వంలో “వందేమాతరం ” సినిమా తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

తరువాత ముత్యాల సుబ్భయ్య తో “అరుణకిరణం “,టి . కృష్ణ తో “దేవాలయం “,ముత్యాల సుబ్బయ్య తో “ఇదా ప్రపంచం “, “మమతల కోవెల “, “ఇన్స్పెక్టర్ ప్రతాప్ “, రేలంగి నరసింహా రావు తో “పద్మావతి కళ్యాణం ” , బాపుతో తో “కల్యాణ తాంబూలం ” ,కోడి రామ కృష్ణతో “గాడ్ ఫాథర్ ” చిత్రాలను నిర్మించారు. తన సినిమాల ద్వారా ఎందరో నటి నటులను, దర్శకులను పరిచయం చేసి, ప్రోత్సహించారు . .
సామాజిక సమస్యలతో నిర్మించిన చిత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డులను ప్రదానం చేసి సత్కరించింది .


సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన హరి కృష్ణ అంటే అందరూ ఎంతో అభిమానంగా ఉండేవారు. రామారావు, నాగేశ్వర రావు , శోభన్ బాబు , కృష్ణ , కృష్ణం రాజు , చిరంజీవి ,, నిర్మాతలు డి .వి .ఎస్ రాజు, రామానాయుడు , ఎమ్మెస్ రెడ్డి , వీబీ రాజేంద్ర ప్రసాద్, అట్లూరి పూర్ణ చంద్ర రావు , తాతినేని రామారావు మొదలైన వారు హరికృష్ణను ఆత్మీయులుగా భావించేవారు .

1979లో హైద్రాబాద్లో ప్రారంభమైన ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలికి కార్యదర్శిగా, 1993లో హైద్రాబాద్లో ప్రారంభమైన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు సంయుక్త కార్యదర్శిగా , నంది అవార్డుల కమిటీ సభ్యుడుగా, 1986లో హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఆహ్వాన సంఘ సభ్యుడు గా హరి కృష్ణ సేవలందించారు.

నిర్విరామంగా సినిమా రంగానికి అంకితమైన హరికృష్ణ 2013 సెప్టెంబర్ 13న ఇహలోక యాత్ర ముగించారు. హరి కృష్ణకు రాజ్య లక్ష్మి తో చిన్నప్పుడే వివాహమైంది. ఈ దంపతులకు రవి బాబు, అనిల్ బాబు, చిన్న బాబు ముగ్గురు సంతానం. హరి కృష్ణ మేనల్లుడు కాట్రగడ్డ ప్రసాద్ ఆయన మార్గదర్శ కత్వములో సినిమా రంగంలో పంపిణీదారుగా వసుధ చిత్రను ప్రారంభించి అనంతరం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం కాట్రగడ్డ ప్రసాద్ దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వున్నారు . తెలుగు సినిమా రంగంలో యలమంచి హరి కృష్ణ .నిర్మించిన చిత్రాల ద్వారా ఆయన స్మృతి ఎప్పటికీ గుర్తుంటుంది. – భగీరథ

Related posts