పవిత్ర వేద మంత్రోచ్ఛారణలు… మంగళవాయిద్యాలు.. గోవిందనామస్మరణ నడుమ శ్రీవారి దేవేరికి సారెను సాగనంపారు. మహావిష్ఱువు స్వరూపుడైన తిరుమలేశుని దివ్యసన్నిధి నుంచి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను అమ్మవారి అవభృధోత్సవానికి తీసుకెళ్లారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ఈ సందర్భంగా 825 గ్రాములు బరువుగల కెంపులు, పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రమైన సారెతో తిరుమల శ్రీవారిని అర్చించే తులసీదళాన్ని ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొచ్చారు.
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న పంచమీతీర్థం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. తిరుచానూరులో పద్మసరోవర్ గా విరాజిల్లుతున్న పుణ్యపుష్కరిని తీరాన అమ్మవారిని కొలువుదీర్చి విశేష అభిషేకాలతో పూజించి, నైవేద్యనివేదన చేస్తారు. సుదర్శనచక్రానికి సన్నపనతిరుమంజనం నిర్వహించడంతోపాటు.. అమ్మవారి దివ్యమంగళ స్వరూపిణికి చందనం, పసుపు, గంధం, కుంకుమ నానావిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు.
అనంతరం శ్రీవారి వక్షస్థల నివాసిని శ్రీలక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. అమ్మవారి పూజానివేదనకోసం శ్రీవారి సన్నిధినుంచి వేకువజామునే సంప్రదాయబద్ధంగా సారెతోపాటు, పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంనుంచి విహరింపుగా తిరుచానూరు బయలుదేరారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారెను తిరుమల తిరుపతి దేవస్ధానాధికారులు గజరాజులపై తిరుచానూరు చేరుకున్నారు. తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకొచ్చారు. అక్కడినుండి కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వద్ద అమ్మవారికి సారె సమర్పించారు.