అమెరికాలోని ఫ్లోరిడా కోర్టులో ఓ ప్రాసిక్యూటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు కోర్టులో ప్రాసిక్యూటర్‌పై మూత్రాన్ని విసిరి కొట్టిన ఘటన బ్రోవార్డ్ సర్క్యూట్ జడ్జి సుసాన్ ఆల్స్పెక్టర్ కోర్టు గదిలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో నిందితుడు అల్బర్ట్ నర్వేజ్‌పై బ్రోవార్డ్ పోలీసులు హత్య కేసుతో పాటు ప్రాసిక్యూటర్‌పై దాడి కేసు కూడా నమోదు చేశారు. ఇక ఈ దాడిలో బ్రోవార్డ్ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ ఆండ్రూ న్యూమాన్ నోటిలో కొంచెం మూత్రం పోవడంతో పాటు ఆయన బట్టలు కూడా తడిసిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నర్వేజ్ ముత్రాన్ని కోర్టులో ఎలా తీసుకొచ్చాడు, ఎందులో తీసుకొచ్చాడో తెలియలేదని పోలీసులు వెల్లడించారు. ఇటీవలె నర్వేజ్ హత్య కేసు విచారణ పూర్తి కాగా, బుధవారం తుది తీర్పు కోసం అతడ్ని కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఇలా హేయమైన చర్యకు పాల్పడ్డాడు. దీంతో న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.