telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించాలి: జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ రోనాల్డ్ రోస్

ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన సెక్టోరియల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ప్రతి పది నుండి 12 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టోరియల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ లో మూడు సార్లు సందర్శించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏ.ఎం.ఎఫ్ (కనీస అవసరాల) లో భాగంగా దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంప్ లు, త్రాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, ఇంటర్నెట్, సాకెట్స్, మరుగుదోడ్లు తదితర సౌకర్యాలు ఉండేవిధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి ఒక రోజు కేటాయించి వారికి పోస్టల్ బ్యాలెట్ ను అందించి అదే రోజు పోస్టల్ బ్యాలెట్ ను స్వీకరిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళా పోలింగ్ సిబ్బందికి పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ లో రిపోర్ట్ చేసేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలోని పోలింగ్ సిబ్బంది సమాచారాన్ని కలిగి ఉండాలన్నారు. సెక్టోరియల్ అధికారులకు పోలింగ్ కు వారం ముందు మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయని, తద్వారా ఎన్నికలకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రూట్ మ్యాప్ ను రూపొందించుకొని సిద్దంగా ఉండాలని తెలిపారు. నవంబర్ 10వ తేదీ తర్వాత బి.ఎల్.ఓ లు ఓటరు స్లిప్ లను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ సారి కొత్తగా ఓటరు సంబంధిత సమాచారాన్ని స్టిక్కర్స్ రూపంలో ప్రతి ఇంటికి అతికిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్య తలెత్తినా సెక్టోరియల్ అధికారులే సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ఈ.వి.ఎం ల పనితీరు పై ప్రిసైడింగ్ అధికారులు సెక్టోరియల్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ.వి.ఎం ల కమిషనింగ్ పై త్వరలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. పోల్ రోజు ముందుగా మాక్ పోల్ నిర్వహించాలని, పోలింగ్ సమయం ముగిసిన అనంతరం క్యూ లో నిలబడిన వారందరూ ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజు మాక్ పోల్ రిపోర్ట్, ఓటరు టర్న్ అవుట్ రిపోర్ట్ ఇతర రిపోర్ట్ లను ప్రిసైడింగ్ అధికారి సెక్టోరియల్ ఆఫీసర్ కు అందించడం ద్వారా డి.ఈ.ఓ కు చేరుతుందని తెలిపారు.

డిప్యూటీ డి.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… సెక్టోరియల్ అధికారులు జిల్లా మిషనరి, ఆర్.ఓ, పోలింగ్ బూత్ సిబ్బందికి వారథి లాగా పనిచేస్తారని తెలిపారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పోలింగ్ రోజు గంట నుండి గంటన్నర వ్యవధిలో పూర్తిగా సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈ.వి.ఎం లు సాంకేతిక సమస్య వచ్చినచో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి సెక్టోరియల్ అధికారులు గైడ్ చేయాలని తెలిపారు. మాక్ పోలింగ్ సమయంలో 50 ఓట్లను ప్రతి ఒక్క అభ్యర్థికి, నోటా కు వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంతకు ముందు జరిగిన శిక్షణ కార్యక్రమాలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై అవగాహన కల్పించామని తెలిపారు.

హైదరాబాద్ డి.ఆర్.ఓ, యాకత్ పుర ఆర్.ఓ వెంకటచారి మాట్లాడుతూ… సెక్టోరియల్ అధికారులకు ప్రి పోల్, పోల్ ఈవ్, పోల్ డే రోజులలో తీసుకోవాల్సిన చర్యల పై సమగ్రంగా వివరించారు. ప్రి పోల్ లో భాగంగా వల్నరేబుల్ మ్యాపింగ్, ఓటరు అవేర్నెస్, కనీస వసతులపై చర్యలు తీసుకోవాలని, పోల్ ఈవ్ లో భాగంగా రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉండేలా, ఎలక్షన్ మెటిరీయల్, సెక్యురిటీ పర్సనల్, ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ లా, పోల్ డే రోజు రాజకీయ పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని తెలిపారు. ఈ.వీ.ఎం, వి.వి ప్యాట్ రీప్లేస్ మెంట్, ఓటరు నమోదు శాతం, రిపోర్ట్ లపై పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో 1500 ఓటర్లకు మించిన వాటిని ఆగ్జలరి పోలింగ్ కేంద్రాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి సంబంధిత ఆర్.ఓ, బి.ఎల్.ఓ ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటరు పేరు నమోదుతో పాటు సప్లిమెంటరీ ఓటరు లిస్ట్ లో కూడా ఓటరు పేరు ఉన్న చో ఓటు హక్కు కు అర్హులని తెలిపారు.

రాజకీయ పార్టీ ఏజెంట్ల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు రాజకీయ పార్టీల ఆఫీస్ లు ఉండకూడదు. పోలింగ్ రోజు ఎటువంటి ప్రచారం చేయకుండా ఎం.సి.సి ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రచారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల లోపు ఉండేవిధంగా చూడాలి. రాజకీయ పార్టీ ప్రతినిధుల వాహనాల పర్మీషన్, డీ ఫేస్ మెంట్, ఫ్రీ బీస్ తదితర సమాచారాన్ని పరిశీలించాలని తెలిపారు. ఓటరు జాబితాలో తమ పేరున మరోసారి రీ-చెక్ చేసుకొని పేరు లేని యెడల ఈ నెల 31వ తేదీ వరకు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో మహిళలకు, సీనియర్ సిటీజన్స్ కు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ ల సమక్షంలో వెబ్ కాస్టింగ్ నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ.వీ.ఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ లో ఏదైన సమస్య వచ్చినచో సంబంధిత సామాగ్రిని మార్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఆర్.ఓ వెంకటేష్ దోత్రె, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts