మిర్యాలగూడ..తెలంగాణలో వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపును టీఆర్ ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. క్రమ క్రమంగా రాష్ట్రంలో జవసత్వాలు అందుకుంటున్న బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక, టీఆర్ ఎస్ దాడులకు తెగబడుతోంది.
తాజాగా నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ ఎస్ కార్యకర్తలు. ఐనా పట్టువదలని బండి సంజయ్ తన యాత్రను కొనసాగించారు. జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలోకి ఈయాత్ర చేరుకోగానే ఇటు టీఆర్ ఎస్ కార్యకర్తలు, అటు బిజెపి శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవాలనే టీఆర్ ఎస్ కార్యకర్తల ప్రయత్నాలు ఫలించలేదు. టిఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసనకు దిగారు. దరిమిల ఇరు వర్గాల శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశాయి. దీంతో టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
దీంతో బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ పర్యటన బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రావడంతో రెచ్చిపోయిన టీఆర్ ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులపై రాళ్ళు, కోడిగుడ్ల తో దాడులు చేశారు.
బీజేపీ నాయకులు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐకేపీ సెంటర్ దగ్గరకు స్వయంగా డీఐజీ రంగనాథ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

