telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

క్యూఆర్ కోడ్ తో.. మెట్రో టికెట్.. రద్దీతో అందుబాటులోకి..

rayadurgam metro line starts on 29th

హైదరాబాద్ మెట్రో రైలుకు క్రమేపీ ప్రయాణికుల సంఖ్య పెరుగతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రో రైలుకూడా తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్ -మియాపూర్ మార్గాల్లో సేవలందిస్తున్న మెట్రో కొత్త సంవత్సరంలో జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ కారిడార్‌లో తన సేవలు అందుబాటులోకి తీసుకు రానుంది. నానాటికీ పెరుగుతున్న రద్జీని దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు టికెట్ల కోసం ప్రయాణికులు క్యూలైన్లలో నిలబడకుండా త్వరితగతిని ప్రయాణించేందుకు క్యూఆర్ కోడ్ సిస్టంను అమలు చేస్తున్నారు. డిసెంబర్ 23 సోమవారం నుంచి ఈవిధానం అన్ని మెట్రో స్టేషన్లలోనూ లభ్యం అవుతుంది. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌చేసుకునే క్యూఆర్‌కోడ్‌ టికెట్‌ విధానాన్ని మెట్రోరైల్‌ ఎండి ఎన్వీఎస్‌రెడ్డి సోమవారం హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి మెట్రో తన సేవలను మరింత పెంచింది. ఆర్టీసీ సమ్మె కాలం నాటికి 3 లక్షలు వరకు ఉన్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగి ప్రస్తుతం 4.24 లక్షల మందికి చేరుకుంది. హైటెక్‌ సిటీ నుంచి రోజుకు సుమారు 6,125 మంది రాకపోకలు సాగిస్తుండగా, అమీర్‌పేట్‌ నుంచి మరో 4,102 మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. హైదరాబాద్ నగరంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రో పై ఎక్కువ ఆధార పడుతున్నారు.

మరో ప్రధాన మెట్రో స్టేషన్‌ ఎల్బీనగర్‌ నుంచి 3,950 మంది, మియాపూర్‌ నుంచి 5,150 మంది, బేగంపేట్‌ నుంచి 1500 మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కూకట్‌పల్లి నుంచి 2,200, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మరో 1430 మంది పెరిగినట్లు అంచనా. మొత్తంగా గతంలో 4 లక్షలు ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.24 లక్షలు దాటిపోయింది. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌ నడుస్తున్న జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ కారిడార్‌లో జనవరి చివరినాటికి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 11 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి మీదుగా కోఠి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related posts