telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీ శ్రీ  ముద్ర … వారితో అనుబంధం 

Telugu Sahityam MahaKavi Sri Sri Srirangam Srinivasarao Mudhra
తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు . తెలుగు సాహిత్య చరిత్రలో ఓ వెలుగు బాట వేసిన శ్రీ శ్రీ ని ఇప్పటికే అభిమానించేవారు , స్ఫూర్తిగా తీసుకునే కవులు వున్నారు . ఈరోజు శ్రీ శ్రీ 109 వ జయంతి. తెలుగు సాహిత్యాభిమానులు గుర్తు చేసుకుంటున్న రోజు . నేను ఇప్పటికీ సామాన్యుడినే . కానీ అసామాన్యులైన మహనీయుల అభిమానం సంపాదించడం నిజంగా నా అదృష్టం . ఇలాంటి అవకాశాలను , అభిమానాలను నేను ఊహించలేదు . నా వృత్తి జీవితంలో , వ్యక్తిగత జీవితంలో ఎందరో  మహానుభావులు పరిచయ భాగ్యం కలిగింది . 
ఆ మహనీయ వ్యక్తుల  వ్యక్తిత్వ ప్రభావం నాపై అమితంగా వుంది . నేను 10వ తరగతి చదివే రోజుల నుంచి శ్రీ శ్రీ రచనలను అమితంగా ఇష్టపడేవాడిని . మా ఊరు గ్రంధాలయంలో వున్న “మహాప్రస్థానం ” కవితా సంకలనం నన్ను బాగా ఆకట్టుకుంది . 1971లో ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చాక “మహాప్రస్థానం ” పుస్తకం కొన్నాను . క్లాసు  పుస్తకాల కన్నా మహాప్రస్థానమే ఎక్కువగా చదివేవాడిని . మా అన్నయ్య కోటేశ్వర రావు నన్ను అనేక సార్లు హెచ్చరించాడు . ఒకసారి మా అన్నయ్య “నీ జీవితంలో శ్రీ శ్రీ ని కనీసం చూడను కూడా చూడలేవు, ఎందుకు ఇలా టైం వేస్టు  చేసుకుంటావు ” అన్నాడు . ఆ మాటలను నా పై  విశేషమైన ప్రభావం చూపించాయి . మహా ప్రస్థానం స్పూర్తితో కవిత్వం రాయడం మొదలు పెట్టాను . 
Telugu Sahityam MahaKavi Sri Sri Srirangam Srinivasarao Mudhra
ఇంటర్మీడియేట్ , డిగ్రీ తరువాత 1977 లో నేను  జర్నలిజంలో చేరాను . అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది . 1979లో నేను ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్రాల్లో రిపోర్టర్ గా వున్నాను . నిర్మాత , దర్శకుడు యు . విశ్వేశ్వర రావు గారు అప్పట్లో సంచలనం సృష్టించిన రమీజాబీ ఘటన స్ఫూర్తిగా “నగ్న సత్యం ” అనే చిత్రం నిర్మించాడు . ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో  కృష్ణవేణి నటించింది ఆ చిత్రం 1979 ఏప్రిల్ 28న విడుదలైంది . ఈ సందర్భంగా విశ్వేశ్వర రావు గారు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించాలనుకున్నారు . ఆయనతో పాటు మహాకవి శ్రీ శ్రీ , నిర్మాత దర్శకుడు పి పుల్లయ్య గారు , కృష్ణవేణి , విశ్వేశ్వర రావు గారి మేనల్లుడు అడుసుమిల్లి పాండురంగారావు గారు . పాండురంగారావు గారు  హైకోర్టులో పేరున్న న్యాయవాది . వీరు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు .
అయితే అప్పటికే నేను పాండురంగారావు గారికి పరిచయం . వారు అప్పుడు బషీర్ బాగ్ లో ఉండేవారు . వారితో పాటు నన్ను కూడా ఆహ్వానించారు . శ్రీ శ్రీ పేరు వినగానే పులకరించి పోయాను. అలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేదు . విశ్వేశ్వర రావు గారు , శ్రీ శ్రీ , పుల్లయ్య గారు ఒక కారులో నేను పాండురంగారావు గారు , కృష్ణవేణి ఒక కారులో బయలు దేరబోయే ముందు పాండురంగారావు గారు నన్ను శ్రీ శ్రీ గారికి , విశ్వేశ్వర రావు గారికి, పుల్లయ్య గారికి పరిచయం చేశారు . శ్రీ శ్రీ గారిని  విశ్వేశ్వర రావు బాస్ అని పిలిచేవారు . శ్రీశ్రీ గారు కూడా విశ్వేశ్వర రావు గారిని బాస్ అనేవారు . విశ్వేశ్వర రావు గారనే శ్రీ శ్రీ గారు బాగా అభిమానించేవారు . శ్రీ శ్రీ గారిని అనేక సందర్భాలలో విశ్వేశ్వర రావు గారు ఆదుకునేవారని అంటారు . 
Telugu Sahityam MahaKavi Sri Sri Srirangam Srinivasarao Mudhra
అలాగే శ్రీ శ్రీ గారంటే పుల్లయ్యగారికి ఎంతో ఇష్టం . ఈ యుగపు మహా కవి శ్రీ శ్రీ , తెలుగు సినిమాలో గొప్ప దర్శకు పుల్లయ్య , విశ్వేశ్వర రావు గారితో మూడు రోజులపాటు వుండే అరుదైన , అపూర్వమైన అవకాశం కలిగింది . అప్పుడు నా గురించి శ్రీ శ్రీ గారికి చెప్పుకునే అవకాశం వచ్చింది . అప్పుడు శ్రీ శ్రీ గారికి నేనంటే సదభిప్రాయం కలిగింది . ఆ తరువాత నేను వ్రాసిన కవిత్వం “మానవత” పేరుతో పుస్తకంగా ప్రచురించాను . 
ఈ మానవత కవితా సంపుటికి ముందు మాట రాయడం కాకుండా మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి 1980 జూన్ 1 వ  తేదీన మహాకవి శ్రీ శ్రీ నా పుస్తకాన్ని ఆవిష్కరించారు . అప్పటి హై కోర్టు న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు సభాధ్యక్షులు . విశ్వేశ్వర రావు గారు ముఖ్య అతిధి . జి ఎస్ వరదాచారి గారు , మా గురువు ఆచార్య తిరుమల వక్తలు . ఈ పుస్తకాన్ని న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారికి అంకితం ఇచ్చాను ఈ కార్యక్రమాన్ని మిత్రుడు కిన్నెర రఘురాం ఏర్పాటు చేశాడు . ఇది నేను ఊహించని ఘటన . నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన సంఘటన . అలాంటి హేమా హేమీల తో ఒకే వేదికపై కూర్చునే అవకాశం కలిగింది . ఈ కార్యక్రమానికి మా అన్నయ్య  కోటేశ్వర రావు కూడా  వచ్చారు . 
Telugu Sahityam MahaKavi Sri Sri Srirangam Srinivasarao Mudhra
శ్రీశ్రీ గారికి . పుల్లయ్య గారికి , విశ్వేశ్వర రావు గారికి మా అన్నయ్యను పరిచయం చేశాను . కార్యక్రమం చూసి తరువాత ఆయనకు ఆనంద భాష్పాలు వచ్చాయి ఆ తరువాత శ్రీశ్రీ గారు నాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు . అదీ  స్వదస్తూరితో . ఇది అపురూపమైన ఇంటర్వ్యూ . 30 ఏప్రిల్ 1910 న విశాఖపట్నం లో జంపించిన శ్రీ శ్రీ తన 73వ ఏట  15 జూన్ 1983 న చెన్నైలో ఇహలోక యాత్ర చాలించారు . శ్రీ శ్రీ … రెండు అక్షరాలే … తన రచనలతో తర తరాలను ప్రభావితం చేసిన స్ఫూర్తి ప్రదాత . 
-భగీరథ

Related posts